Ratha Saptami 2025: తిరుపతి ఘటనతో TTD అలెర్ట్.. మినీ బ్రహ్మోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు..

తిరుమలలో ఫిబ్రవరి 4న రథ సప్తమి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మినీ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఏర్పాట్లపై సమీక్షించేందుకు టీటీడీ బోర్డు జనవరి 31న అత్యవసరంగా సమావేశంకానుంది.

Ratha Saptami 2025: తిరుపతి ఘటనతో TTD అలెర్ట్.. మినీ బ్రహ్మోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు..
Suryaprabha Vahanam (File Photo)
Image Credit source: TTD

Updated on: Jan 26, 2025 | 9:56 PM

Ratha Saptami 2025: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ అలెర్ట్) అయ్యింది. రథ సప్తమి సందర్భంగా ఫిబ్రవరి 4న ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ఇప్పటికే దృష్టిసారించారు. రథసప్తమి ఏర్పాట్లను సమీక్షించేందుకు టీటీడీ బోర్డు ఈ నెల 31న అత్యవసరంగా సమావేశంకానున్నారు. తిరుమలలో భక్తులకు కల్పించే సౌకర్యాలు, మరీ ముఖ్యంగా ఆలయ మాడవీధుల్లో ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జే.శ్యామలరావు అధికారులకు కీలక సూచనలు చేయనున్నారు.

సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 4న తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో రథసప్తమి వేడుకను వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఒకే రోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి తిరువాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తారు.

తిరుమలలో ఆ దర్శనాలు రద్దు

ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్‌డీ) టోకన్ల జారీని రద్దు చేశారు. ఎలాంటి టోకన్లు లేని భక్తులు నేరు సర్వదర్శనం క్యూలైన్లలోకి ప్రవేశించి స్వామివారి దర్శించుకోవచ్చు.

ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలతో పాటు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనలను రద్దు చేశారు. ఆ రోజున నేరుగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే దర్శనం కల్పిస్తారు.

ఫిబ్రవరి 4న ఎన్నారైలు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు కల్పిస్తున్న ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు.

రథ సప్తమి రోజున వాహన సేవల షెడ్యూల్

5:30 AM – 8:00 AM: సూర్య ప్రభ వాహనం (సూర్యోదయం: 6:44 AM)

9:00 AM – 10:00 AM: చినశేష వాహనం

11:00 AM – 12:00 PM: గరుడ వాహనం

1:00 PM – 2:00 PM: హనుమంత వాహనం

2:00 PM – 3:00 PM: చక్రస్నానం

4:00 PM – 5:00 PM: కల్పవృక్ష వాహనం

6:00 PM – 7:00 PM: సర్వభూపాల వాహనం

8:00 PM – 9:00 PM: చంద్రప్రభ వాహనం