Case against Janasena leaders: జనసేన నేతలపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్న జనసేన నేతలు.. బ్యానర్లను చింపివేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి ప్రజలు ఏర్పాటు చేసిన బ్యానర్లను చింపి వేశారని తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించకుండా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా జనసేన నేతలు వ్యవహరించారని పోలీస్ ప్రొసీడింగ్స్ ఎస్సై నాగేంద్ర బాబు పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన నేతలు డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్, సుభాషిని, రాజారెడ్డి, రాజేష్ యాదవ్, బాబ్జి, ఆనంద్, కృష్ణ, రాందాస్ చౌదరిలతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఐపీసీ 427, 188, 341, 270, 271, 143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు నాగేంద్ర బాబు తెలిపారు.
అమరావతి రైతుల పాదయాత్ర ఈ రోజు ముగిసింది. అయితే.. తిరుపతి నగరంలో అమరావతి రైతులు నడుచుకుంటూ అలిపిరికి ప్రయాణమైన క్రమంలో.. వారి పాదయాత్రను స్వాగతిస్తూనే రాయలసీమ ఆకాంక్షలను గౌరవించాలంటూ తిరుపతిలోని కొందరు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తమకు 3 రాజధానులే కావాలని.. అమరావతి పెద్దలారా ఆలోచించండి.. అంటూ కొందరు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా.. జనసేన కార్యకర్తలు, నేతలు వాటిని చింపినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: