కలియుగ వైకుంఠంలో అద్భుతం.. 116 ఏళ్ల వృద్ధురాలి భక్తికి కరిగిన టిటిడి చైర్మన్.. ప్రత్యేక మార్గంలో శ్రీవారి దర్శనం!
భక్తికి వయసుతో నిమిత్తం లేదని, దృఢమైన సంకల్పం ఉంటే ఎంతటి కష్టమైన కార్యాన్నైనా సాధించవచ్చని నిరూపించింది 116 ఏళ్ల నవనీతమ్మ. ఏడుకొండల వాడిని దర్శించుకోవాలనే ఆమె కఠోర దీక్ష, ఆచంచలమైన భక్తి తిరుమల యాత్రలో ఒక మరపురాని ఘట్టంగా నిలిచింది. ఈ వయసులోనూ ఆమె శ్రీవారిని కీర్తిస్తూ అలిపిరి నడక మార్గంలో కొండ ఎక్కేందుకు ప్రయత్నించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

116 ఏళ్ల వయసులోనూ వెంకన్న దర్శనం చేసుకోవాలని ప్రయత్నించిన నవనీతమ్మ కోరిక తీరింది. అలిపిరి నడక మార్గంలో నిన్న శ్రీవారి దర్శనం కోసం కొండకు చేరే ప్రయత్నం చేసిన 116 ఏళ్ల వృద్దురాలి కఠోర దీక్ష ఫలించింది. ఏడుకొండల వాడిని కీర్తిస్తూ కొండ మెట్లు ఎక్కుతున్న వృద్ధురాలు నవనీతమ్మ ప్రయత్నం మీడియా లో వైరల్ అయింది. తమిళనాడుకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మ ఆచంచల భక్తి తిరుమలలో ఒక అద్భుత ఘట్టానికి వేదికైంది. ఈ వయసులోనూ ఆమె శ్రీవారిని కీర్తిస్తూ అలిపిరి నడక మార్గంలో కొండ ఎక్కేందుకు ప్రయత్నించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై టీటీడీ చైర్మన్ సానుకూలంగా స్పందించి, ఎక్స్ (X) వేదికగా ఆమె వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
మీడియాలో వైరల్ అయిన అలిపిరి నడక యాత్ర:
తమిళనాడుకు చెందిన 116 సంవత్సరాల వృద్ధురాలు నవనీతమ్మ.. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలనే కోరికతో అలిపిరి నడక మార్గంలో మెట్లు ఎక్కుతూ కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ వయసులోనూ స్వామివారి నామస్మరణ చేస్తూ ఆమె కొండ ఎక్కుతున్న దృశ్యాలు మీడియా మరియు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆమె భక్తికి ముగ్ధులయ్యారు.
స్పందించిన టీటీడీ చైర్మన్.. విజిలెన్స్ అధికారుల గాలింపు:
ఈ వైరల్ వీడియోలు మరియు వార్తలపై టీటీడీ చైర్మన్ వెంటనే స్పందించారు. ఇంతటి వృద్ధాప్యంలోనూ నవనీతమ్మ చూపిన భక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఆమెకు మరియు ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తామని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. అంతేకాకుండా, ఆమె వివరాలు తెలిసిన వారు చైర్మన్ క్యాంప్ కార్యాలయాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. చైర్మన్ పోస్ట్‌పై సత్వరమే స్పందించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు.. వృద్ధురాలు తిరుపతిలోని జీవకోనలో ఉన్న తన బంధువుల ఇంట్లో బస చేసినట్లు గుర్తించారు.
వీఐపీ బ్రేక్ సమయంలో ప్రత్యేక దర్శనం:
టీటీడీ అధికారుల చొరవతో ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ (VIP Break) దర్శన సమయంలో నవనీతమ్మను, ఆమె కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా తిరుమలకు తీసుకువచ్చారు. ఆలయ బయోమెట్రిక్ మార్గం గుండా ఆమెకు సులభంగా లోపలికి ప్రవేశం కల్పించారు. నవనీతమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. దర్శనానంతరం ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి ఆశీస్సులు అందజేశారు. 116 ఏళ్ల వయసులో నవనీతమ్మ కల నెరవేరడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




