తెలుగు దేశం పార్టీ సంచలనం నిర్ణయం తీసుకుంది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టీడీపీ ప్రకటించింది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని టీడీపీ అధిష్టానం సీరియస్‌గా పరిగణించింది. అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు.
2024 ఎన్నికల ముందు వైసీపీ నుండి టీడీపీలో చేరి కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే సొంత పార్టీ మహిళా నేతను బెదింరించి, ఆమెతో ప్రైవేటు హోటల్‌లో ఏకాంతంగా గడుపుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో మీడియా సమావేశం పెట్టిన మహిళ, తనను బెదిరించి బలవంతంగా లొంగదీసుకున్నట్లు ఆమె ఆరోపించారు. తనకు లొంగకపోతే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే ఆదిమూలం బెదిరించారని, తప్పనిసరి పరిస్థితుల్లో అతడికి లొంగక తప్పలేదని బాధిత మహిళ తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండొద్దని బాధిత మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అధిష్టానం సీరియస్‌గా స్పందించి, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..