శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. భక్తులు తమ ఇష్టదైవనానికి తోచిన విరాళాలను అందజేస్తుంటారు. ఈ క్రమంలోనే శ్రీశైల దేవస్ధానానికి తిరుపతికి చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి అనే భక్తుడు భారీ విరాళం అందజేశాడు. సోమవారం శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ఉదయ్ కుమార్ రెడ్డి కుటుంబం దేవస్థానానికి ఎంజీ మోటార్స్ కారు ఆస్టర్ ను విరాళంగా అందజేశారు. మార్కెట్లో ఈ కారు విలువ రూ.15 లక్షలు ఉంటుంది. శ్రీశైలం ఈవో పెద్దిరాజుకు ఉదయ్ కుమార్ రెడ్డి ఈ కారును అందజేశారు. సోమవారం ఉదయం గంగాధర మండపం వద్ద వేద పండితులు కారుకు ప్రత్యేక పూజలు చేశారు.
కాగా, ఈ కారును దేవస్థానం ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ప్రధాన ఆలయం ఎదురుగల గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానానికి అందజేయగా, ఆలయ పూజారులు వారికి స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజుతోపాటు ఈఈ రామకృష్ణ, ఏఈవో మోహన్, స్వామివారి ఆలయ ప్రధానార్చకుడు శివప్రసాద్ పాల్గొన్నారు.
విరాళాలు ఇచ్చిన దాతలకు ఆలయ అధికారులు భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు, అందించి సత్కరించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..