Tirumala Tirupati Temple: తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చకుల నియామకానికి సంబంధించి టీటీడీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీవారి ఆలయంలోని నలుగురు అర్చకులను ముఖ్య అర్చకులుగా నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను టీటీడీ బుధవారం నాడు జారీ చేసింది. అలాగే, టీటీడీ అర్చక వ్యవస్థలో మూడు రకాల పోస్టులు ఏర్పాటు చేసింది టీటీడీ బోర్డు. ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, అర్చకులు అనే పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ పోస్టులలో వంశపారంపర్య అర్చకులనే ముఖ్య అర్చకులుగా నియమిస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తాజాగా నియమించిన అర్చకుల్లో గొల్లపల్లి కుటుంబం నుంచి గోపీనాథ్ దీక్షితులు, పైడిపల్లి నుంచి రాజేశ్ దీక్షితులు, పెద్దింటి నుంచి రవిచంద్ర దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి నారాయణ దీక్షితులు ని ముఖ్య అర్చకులుగా టీటీడీ నియమించింది.
ఇదిలాఉంటే.. టీటీడీలో అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించాలని సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం మేరకు టీటీడీ కూడా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి అదే స్థానంలో విధుల్లోకి తీసుకుంది. దీంతో రమణ దీక్షితులు ప్రధాన అర్చకులుగా తిరిగి బాధ్యతలు చేపట్టారు. 2018 మే నెలలో అప్పటి టీటీడీ పాలకమండలి ఆలయ అర్చకులకు రిటైర్మెంట్ నిబంధనలు అమలు చేసింది. 65 సంవత్సరాలు పైబడిన వారు రిటైర్ అవ్వాల్సిందిగా ప్రకటించారు. ఆ నిర్ణయంతో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస మూర్తి దీక్షితులు, నారాయణ దీక్షితులు తో పాటు.. మరికొంత మంది అర్చకులు రిటైర్ అయ్యారు. అయితే, టీటీడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తిరుచానూరు ఆలయం ప్రధాన అర్చకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. 2018 డిసెంబర్ నెలలో రిటైర్డ్ నిబంధనలను అమలు చేయకూడదని స్పష్టం చేసింది. ఆ మేరకు టీటీడీని ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలను తమకు కూడా వర్తింప జేయాలని రిటైర్డ్ అర్చకులు అంతా టీటీడీని కోరారు. కానీ, అప్పటి టీటీడీ పాలక మండలి ఆ ఆదేశాలను వర్తింపజేయలేదు. దాంతో రమణ దీక్షితులు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కలిశారు. జరిగిన విషయాన్ని వివరించారు. తాము అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు తాజాగా రిటైర్డ్ అర్చకులందరినీ తిరిగి టీటీడీలోకి తీసుకున్నారు.
Also read:
Facebook Data Leake: మీ ఫేస్ బుక్ డేటా లీక్ అయ్యిందో.. లేదో.. ఇలా తెలుసుకోండి..
‘శాకుంతలం’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సమంతకు ఇష్టసఖిగా రానున్న ఆ హీరోయిన్…