AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!

Tirumala Brahmotsavam 2026: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు 14న శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనుంది. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు సీఎం దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనుండగా పలు ప్రారంభోత్సవాలకు టీటీడీ సిద్ధమవుతోంది.

Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
Tirumala Brahmotsavam 2026
Raju M P R
| Edited By: |

Updated on: Aug 20, 2026 | 10:24 AM

Share

తిరుమల: కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది అధికమాసం కారణంగా టీటీడీ రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది. సెప్టెంబర్ 14న శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుండగా, సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగనున్నాయి. బ్రహ్మోత్సవాల మొదటి రోజైన సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అదే రోజున పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు.

ఈ క్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో డాక్టర్ ఏ. శరత్, సీవీఎస్వో మురళీకృష్ణలతో కలిసి విభాగాధిపతులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు.

బ్రహ్మోత్సవాల ముఖ్య ఘట్టాలు

  • 08-09-2026: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
  • 14-09-2026: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
  • 15-09-2026: ధ్వజారోహణం
  • 19-09-2026: గరుడ వాహనం
  • 22-09-2026: రథోత్సవం
  • 23-09-2026: చక్రస్నానం

భక్తుల సౌకర్యార్థం టీటీడీ కీలక నిర్ణయాలు

వాహన సేవల వేళలు: ప్రతిరోజూ ఉదయం 8:00 నుండి 10:00 గంటల వరకు, సాయంత్రం 7:00 నుండి 9:00 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నట్టు టీటీడీ పేర్కొంది.

ప్రత్యేక దర్శనాలు రద్దు: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్నారైలు, దాతల ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్టు పేర్కొంది.

ద్విచక్ర వాహనాలపై నిషేధం: గరుడసేవ రద్దీ దృష్ట్యా 18-09-2026 రాత్రి 9:00 గంటల నుండి 20-09-2026 ఉదయం 6:00 గంటల వరకు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపివేసినట్టు తెలిపింది.

మౌలిక వసతులు : భక్తులకు క్యూలైన్లు, మాడ వీధుల గ్యాలరీల్లో విరివిగా అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. గ్యాలరీల్లోని మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని నియమిస్తున్నారు. విద్యుత్ అలంకరణలు, ఫల-పుష్ప ప్రదర్శనలు, తగిన సంఖ్యలో లడ్డూల నిల్వలను సిద్ధం చేస్తున్నారు.

పుష్కరిణి పనులు: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 1 నుంచి జరుగుతున్న పుష్కరిణి మరమ్మతు పనులను వేగవంతం చేశారు. భక్తుల భద్రత కోసం పుష్కరిణిలో గ్రిల్స్, లోతు తెలిపే సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.

సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానున్న ప్రాజెక్టులు

ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ

కొన్నేళ్లుగా మూతపడ్డ ఎస్వీ మ్యూజియాన్ని అత్యాధునిక హంగులతో టీటీడీ తీర్చిదిద్దింది. టీసీఎస్ రూ. 125 కోట్లు, మ్యాప్ సంస్థ రూ. 20 కోట్లు అందించిన మొత్తం రూ. 145 కోట్ల విరాళాలతో జీ ప్లస్ 3 అంతస్తుల్లో 19 గ్యాలరీలను 3D, 7D సాంకేతికతతో పునరుద్ధరించారు. ఆలయ శిల్పకళ, విగ్రహాలు, అన్నమయ్య రాగి రేకులు, పురాతన నాణేలు, వేదాలు, పురాణ ఘట్టాలు, భక్తాగ్రేసరుల చరిత్రలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. భవనం పైభాగంలో 17 గోపురాలను నిర్మించారు.

బయోగ్యాస్ ప్లాంట్

తిరుమలలోని రోజువారీ చెత్తతో పాటు పేరుకుపోయిన దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల లెగసి చెత్త సమస్యను పరిష్కరించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOCL సహకారంతో రూ. 12 కోట్లతో రెండు ఎకరాల డంపింగ్ యార్డులో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మించారు. రోజుకు 1000 కేజీల బయోగ్యాస్ ఉత్పత్తి చేసే లక్ష్యంగా ప్లాంట్ నిర్మాణం జరగా బ్రహ్మోత్సవాల్లోనే బయోగ్యాస్ ప్లాంట్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.

25 ఎలక్ట్రిక్ బస్సులు

తిరుమలలో వాహన కాలుష్యం పెరిగిపోతుడంతో టీటీడీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే దాతల సహాయాన్ని కోరుతోంది. రిలయన్స్ సంస్థ విరాళంగా ఇచ్చిన 25 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం బ్రహ్మోత్సవాల్లో జెండా ఊపి ప్రారంభించ నుండగా ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us