వారంతా రోజు కూలీలు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వ్యవసాయ క్షేత్రాల్లో పని చేస్తారు. ఎప్పటి లాగే ఇవాళ ఉదయం తెనాలి మండలం దుండిపాలెం నుంచి చేబ్రోలు మండలం శలపాడుకు ఆటోలో బయలు దేరారు. మొత్తం పదకొండు మంది కూలీలు ఆటో ఎక్కారు. ఆటో చేబ్రోలు మండలం గరువు పాలెం చేరుకుంది. అదే సమయంలో జనరేటర్ కట్టుకున్న బొలెరో వాహనం తెనాలి వైపు వెళుతోంది. అప్పుడు బొలెరో వాహనం నుంచి జనరేటర్ ఒక్కసారిగా విడిపోయింది. అంతేకాకుండా అటువైపు నుంచి వస్తున్న ఆటోను ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయాలయిన వారిని డీవీసీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. జనరేటర్ తరలించే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో రాకపోకలను ఇబ్బంది ఏర్పడింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..