ఇంకా సమ్మర్ స్టార్ట్ కాలేదు.. ఇప్పటికే భానుడు భగభగా మండుతున్నాడు. రథసప్తమి ఇలా వెళ్లిందో లేదో.. అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో.. ప్రజలు ఇప్పటి నుంచే పలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.
కాగా.. గతేడాది అత్యధికంగా తెలంగాణలోని రామగుండం ప్రాంతంలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా ఈ ఏడాది అంతకు మించిన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ఎండలకు తోడు వడగాలుల తీవ్రత పెరిగే అవకాశముందని వారు చెప్పారు. కాగా ఇప్పటి వరకూ భద్రాచలంలో 1973లో 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఆల్ టైమ్ రికార్డు కాగా.. ఈ సారి దాదాపు అంతే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే శివరాత్రి తర్వాత ఈ ఎండలు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు.