Andhra Pradesh: ఆ ఊరే ఒక సైన్యం.. ఆడపిల్లను ఇవ్వాలన్నా అల్లుడు పోలీసో, జవానో అయిఉండాల్సిందే..
అవి ఆంగ్లేయులు పాలిస్తున్న రోజులు. ఉప్పు మీద ఆంక్షలు కొనసాగుతున్న వేళ.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ సమయంలో ఆంగ్లేయులు మనవాళ్లనే రక్షణ కోసం వాడుకున్నారు. 18 ఏళ్లు దాటి ధృడంగా ఉన్న యువకులను మిలిటరీ, ఉప్పు కొఠార్లు వద్ద జవాన్లుగా ఎంపిక చేశారు. ఆ నాడు అలా రక్షణ కోసం పడిన అడుగులు నేడు దేశ భక్తి వైపు నడిపించాయి. చిత్రమేమిటంటే పూర్వీకుల నుంచి వంశపారపర్యంగా ఈ కొలువులు చేస్తున్న వారి ఇంటిపేరు 'తుపాకుల'.. దశాబ్దాలుగా దేశ రక్షణ వ్యవస్థలోనే అనేక విభాగాల్లో తుపాకుల వంశీయులు స్థిరపడి సేవలందిస్తున్నారు.
అవి ఆంగ్లేయులు పాలిస్తున్న రోజులు. ఉప్పు మీద ఆంక్షలు కొనసాగుతున్న వేళ.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ సమయంలో ఆంగ్లేయులు మనవాళ్లనే రక్షణ కోసం వాడుకున్నారు. 18 ఏళ్లు దాటి ధృడంగా ఉన్న యువకులను మిలిటరీ, ఉప్పు కొఠార్లు వద్ద జవాన్లుగా ఎంపిక చేశారు. ఆ నాడు అలా రక్షణ కోసం పడిన అడుగులు నేడు దేశ భక్తి వైపు నడిపించాయి. చిత్రమేమిటంటే పూర్వీకుల నుంచి వంశపారపర్యంగా ఈ కొలువులు చేస్తున్న వారి ఇంటిపేరు ‘తుపాకుల’.. దశాబ్దాలుగా దేశ రక్షణ వ్యవస్థలోనే అనేక విభాగాల్లో తుపాకుల వంశీయులు స్థిరపడి సేవలందిస్తున్నారు. ఆ వంశీయులే కాకుండా.. వారి అల్లుళ్లు సైతం ఇవే వ్యవస్థల్లో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖతో పాటు భారతదేశ సరిహద్దుల్లో తుపాకుల వంశానికి చెందిన వారు తారసపడతారు. ఇంటి పేరును ఆయుధంగా మార్చుకుని వందలాది మంది తుపాకులు చేతపట్టారు. ‘తుపాకుల’ వంశం వివరాలు, వీరి దేశభక్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రకాశం జిల్లా నాలుగులుప్పలపాడు మండలం సముద్ర తీరప్రాంత గ్రామం కనపర్తి. దీనికి చారిత్రాత్మక గుర్తింపు ఉంది. పూర్వం ఈ గ్రామాన్ని కనకపురి పట్టణం అనేవారు. కార్తవ రాయుడు పాలించిన గడ్డ ఇది. ముత్యాలు, వజ్రాలు, రత్నాలను కుప్పలుగా పోసి అమ్మేవారని పూర్వీకుల కథనం. ఇక్కడ పురావస్తు ఆనవాళ్లకు గుర్తుగా నంది విగ్రహాలు, బౌద్ధ మతానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంపై బ్రిటీష్ వాళ్ల కళ్లు పడ్డాయి. కనపర్తి, పెదగంజాం, దేవరంపాడు ప్రాంతాల్లో ఉప్పు పండించేవారు బ్రిటీష్ పాలకులు. బకింగ్ హాం కెనాల్ నుంచి ఉప్పును తమ దేశానికి తరలించే వారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది. ఆ తర్వాత కనపర్తికి పక్కనే ఉన్న దేవరంపాడులో నిర్వహించిన ఉప్పు సత్రాగ్రహానికి మహాత్మా గాంధీ వచ్చి స్వాతంత్ర్య సమర యోధులకు మద్దతు పలికారు కూడా. తమకు రక్షణగా ఉన్న బెటాలియన్ కి, ఉప్పు పొలాల వద్ద రక్షణగా పనిచేసేందుకు స్థానికంగా ఉన్న తుపాకుల వంశీయులను గార్డులుగా నియమించుకున్నారు. వీరు దృఢంగా, భారీ కాయులుగా ఉండటంతో వారిని ప్రత్యేకంగా ఆ కొలువుల్లోకి తీసుకునేవారు. మరికొందర్ని బలవంతంగా బ్రిటీష్ మిలిటరీలోకి తీసుకెళ్లారు. బ్రిటీష్ హయాంలో కనపర్తిలో సాల్ట్ సూపరింటెండెంట్ కార్యాలయం కూడా ఉంది. ఆ సాల్ట్ కార్యాలయానికి ఎదురుగానే బ్రిటీష పోలీస్ క్వార్టర్స్ కూడా పోలీస్ క్వార్టర్స్ ప్రస్తుతం శిథిలమైపోయాయి. సాల్ట్ కార్యాలయం కూడా అవసాన దశకు చేరుకుంది.
మిలిటరీ, పోలీస్ వాళ్లకు పెట్టింది పేరు కనపర్తి..
కనపర్తివాసులు తొలుత మిలిటరీ, ఆ తర్వాత పోలీస్, కాలక్రమేణా ఇతర యూనిఫాం విభాగాల్లో సేవలు అందిస్తే.. కనపర్తి పెద్ద ఊరు మాత్రం మిలిటరీ ఉద్యోగాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం 150 మందికిపైగా దేశ సేవలో పునీతులవుతున్నారంటే ఉద్యోగాలంటే ఎంత మక్కువో అర్థమవుతోంది. గ్రామం నుంచి నలుగురు మిలిటరీలో కెప్టెన్లుగా పదవీ విరమణ చేసిన వారున్నారు. వారిలో తుపాకుల వంశీయులతో కలిసి పాకిస్థాన్, బంగ్లాదేశ్, బర్మా, చైనా యుద్ధాల్లో పాల్గొన్న వారు కూడా ఉన్నారు. పలువురు ఆర్మీలో కెప్టెన్లుగా పనిచేశారు. వీరంతా కాలక్రమేణా వయస్సు రీత్యా మృతి చెందారు. ప్రస్తుతం చాలా మంది బయట ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు.
మిలిటరీలో తొలి అడుగు..
తుపాకుల చెన్నయ్య ఆయన సోదరులు 1930 సంవత్సరానికి ముందు మొదటిసారిగా బ్రిటీష్ మిలిటరీలోకి వెళ్లారు. వాళ్లు నలుగురు సోదరులు. వాళ్లందరూ కూడా మిలిటరీలో దేశానికి సేవచేసిన వారే. తర్వాత ఆయన సంతానం పెద చెన్నయ్య, సోమయ్య, బంగారయ్యలు పోలీసు విధులు నిర్వర్తించారు. ఆయన సంతానంలో తుపాకుల సుబ్బయ్య, రంగయ్య, వెంకటేశ్వర్లు, వీర రాఘవయ్యలు. వీళ్లందరూ కూడా పోలీసులే. ఈ నలుగురు సంతానంలో ఒక్కొక్క ఇంట్లో నలుగురు మొదలుకుని ఎనిమిది మంది వరకు పోలీసులుగా ప్రజలకు సేవలు అందించారు.
ప్రతి ఇంట్లో పోలీసులే..
కనపర్తి తోపు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో పోలీసులే కనపడతారు. తుపాకులతో పాటు ఆవుల, బొజ్జా, మోరబోయిన అనే ఇంటిపేరు వారు కూడా తుపాకుల వారితో పోటీ పడి మరీ పోలీసులతో పాటు ఎక్సెజ్, సెంట్రల్ కస్టమ్స్ ఇలా యూనిఫాం విభాగాల్లోనే సేవలు అందించారు. కానిస్టేబుల్ మొదలుకుని ఏఎస్పీ వరకు అన్ని హోదాల్లో పనిచేసిన వారు ఇక్కడ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గ్రామంలో ఎనిమిది వందల గడపలు ఉంటే యూనిఫాం లేని ఇల్లు ఉండదు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఏ నగరంలోనైనా, ఏ జిల్లా కేంద్రంలోనైనా తుపాకుల ఇంటి పేరు ఉన్న వారు పోలీసు కొలువుల్లో కనిపిస్తారు… తుపాకుల వంశానికి చెందిన తుపాకుల పాములయ్య కుటుంబం కూడా అలాంటిదే.
ఆడపిల్లను ఇవ్వాలన్నా అల్లుడు పోలీస్ అయిఉండాలట..
ఆడపిల్లలను పోలీసులకే ఇచ్చి వివాహం చేసేవారట.. మొదటి నుంచి తుపాకుల వంశీయులు మిలిటరీ, పోలీస్ విభాగాల్లో పనిచేస్తున్నప్పటికీ వారి ఇంటి ఆడపడుచులను కూడా ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వారికే ఇచ్చి సంబంధాలు కలుపుకున్నారు. ఆ విధంగా పుట్టినిల్లు, మెట్టినిల్లు యూనిఫాంలు ధరించే వారితో కలర్‌ఫుల్‌గా ఉండటాన్ని వియ్యాల వారు కూడా స్వాగతించేవారని, అయితే ప్రస్తుతం కొడుకులను పోలీస్ శాఖలో చేరుస్తున్నా, అల్లుళ్లు మాత్రం పోలీసులే దొరకాలంటే కష్టంగా ఉందంటున్నారు.. కాలం మారిన నేపద్యంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల సంబంధాలు ఎక్కువగా వస్తున్నాయంటున్నారు కనపర్తివాసులు.
కనపర్తిలో ఎవరిని కదిలించినా మా వంశం మొత్తం మిలిటరీ, పోలీస్ విభాగాల్లోనే పనిచేశారు. మా ముత్తాత కూడా మిలిటరీలో పనిచేశారని చెబుతారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అర్హతబట్టి మిలిటరీలోకి, పోలీస్ విభాగంలోకి, ఎక్సెజ్ విభాగంలోకి వేరే ఇతర విభాగాల్లోకి కొలువుల్లో చేరేవారు… కనపర్తి గ్రామంలో ఇంటికో పోలీస్, వీధికో జవాన్ ఉండటం తమ గ్రామానికే గర్వకారణమని స్థానికులు చెబుతున్నారు… బ్రిటీష్ హయాంలో కనపర్తి గ్రామంలో ఉప్పు పండించేవారని, అప్పట్లో ప్రభుత్వం తప్పితే ప్రయివేటుగా ఉప్పు పండించే అవకాశం లేకపోవడంతో కొటార్లకు కాపలాగా పనిచేసే వారికోసం స్థానిక యువకులను సైన్యంలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి గ్రామంలోని యువకులు సైనికులుగా, పోలీసులుగా, ఇతర రక్షణ రంగానికి చెందిన శాఖల్లో చేరడం ఆనవాయితీగా మారింది.
మిలటరీ, పోలీసు యూనిఫాం అంటే ఎంతో మక్కువ..
ఊరికి మిలిటరీ, పోలీస్ డ్రెస్సులు వేసుకుని బంధువులు వస్తుండేవారు. అది చూసి చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలన్న ఆశ ఎక్కువగా యువకుల్లో ఉండేది. తమ తాత ముత్తాతలు మిలిటరీ, పోలీసు విభాగాల్లో పనిచేశారు. కనపర్తి గ్రామానికి చెందిన వారిలో ముగ్గురు ఏఎస్పీలుగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. వారిలో తుపాకుల రామకృష్ణ ఏఎస్పీగా రిటైరై తెనాలిలో కుటుంబంతో స్థిరపడ్డారు. మరొకరు తుపాకుల వెంకటేశ్వరరావు ఏఎస్పీగా రిటైరై గుంటూరులో ప్రస్తుతం న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఇంకొకరు ఆవుల సుబ్బారావు ఏఎస్పీగా రిటైరై కాకినాడలో స్థిరపడగా, తుపాకుల మురళీకృష్ణ డీవైఎస్పీగా తిరుపతిలో పనిచేస్తున్నారు. ఇక సీఐ, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, అటు పోలీస్, ఇటు వైజ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ విభాగాల్లో హోదాల్లో పనిచేస్తున్నారు. యూనిఫాం కాకుండా ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా పనిచేసిన, చేస్తున్న వారు కూడా ఉన్నారు… వీరి కుల దేవత తీనె అంకమ్మతల్లి దేవర. ఈ దేవత కొలుపులు మూడేళ్ళకొకసారి చేస్తుంటారు… ఈ సందర్భంగా ఈ ఏడాది దేవత కొలుపులు చేసేందుకు ఎక్కడెక్కడో పోలీసు విభాగాల్లో పనిచేసి ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ కనపర్తి వాసులు తమ స్వగ్రామానికి చేరు తమ పాత జ్ఞాపకాలను గ్రామస్తులతో పంచుకుంటారు…
దేశసేవ రక్తంలోనే ఉంది..
ఒక ఇంట్లో ఒక పోలీసో, ఒక జవానో ఉండటం గగనమైన ఈరోజుల్లో వంశానికి వంశం, గ్రామానికి గ్రామం ఆర్మీలో, పోలీసుశాఖల్లో పనిచేయడం అంటే మామూలు విషయం కాదు.. అయితే దేశసేవ చేయాలన్న జీలు తమ రక్తంలోనే ఉండటంతో ఇది సాధ్యమైందని గ్రామంలోని యువకులు ఉత్సాహంగా చెబుతుంటారు.. గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు అన్నట్టుగా కనపర్తి గ్రామం దేశభక్తికి ఆనవాలుగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..