AP News: వీడో ఖతర్నాక్ దొంగ.. పగలు మాత్రమే దొంగతనాలు.. అసలు కారణం తెలిస్తే అవాక్

ఇతడొక హైఫై దొంగ. కేవలం ఉదయం పూట మాత్రమే దొంగతనాలు చేస్తుంటాడు. అసలు ఎందుకు అలా చేస్తాడో పోలీసులకే అర్ధం కావట్లేదు. ఎట్టకేలకు దొంగ చిక్కిన తర్వాత అతడ్ని అడిగి తెలుసుకోగా.. ఏం సమాధానం చెప్పాడో చూసి దెబ్బకు షాక్ అయ్యారు పోలీసులు.

AP News: వీడో ఖతర్నాక్ దొంగ.. పగలు మాత్రమే దొంగతనాలు.. అసలు కారణం తెలిస్తే అవాక్
Thief

Edited By: Ravi Kiran

Updated on: Feb 22, 2025 | 8:26 PM

సాధారణంగా చాలామంది దొంగలు పగలు రెక్కి నిర్వహించి అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత తాళాలు వేసి ఉన్న ఇల్లు టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ దొంగ తనకు ఉన్న అవయవ లోపంతో.. ఎక్కడా తగ్గకుండా పట్టపగలే దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. పగలు దొంగతనాలు చేయడంలో ఆరితేరిన పగటి దొంగ అయిన మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగను శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పట్ట పగలే చోరీలు చేసే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. అసలు పగలే దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడో తెలుసుకొని పోలీసులే అవాక్కయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరుకు చెందిన సోహెల్ ఖాన్‌కు కంటి సమస్య.. సాయంత్రం 6 గంటలు దాటితే కళ్ళు కనిపించవు. దీంతో దొంగతనం చేసేందుకు పగలు అయితేనే బెటర్ అని.. పగలైతే పెద్దగా ఎవరికి అనుమానం కూడా రాదని సోహెల్ ఖాన్ పట్టపగలు దొంగతనాలు చేయడం మొదలెట్టాడు. అలాగే పెనుకొండలో ఓ ఉపాధ్యాయుడి ఇంటి తాళాలు పగల కొట్టి.. పట్టపగలే దొంగతనం చేసి.. 47 తులాల బంగారు ఆభరణాలు.. లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లాడు. పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్న సోహెల్ ఖాన్ చోర కళ.. సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో ఈ కేసును సవాలుగా తీసుకున్న పెనుకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఎట్టకేలకు పగటి దొంగ సోహెల్ ఖాన్‌ను పట్టుకున్నారు.

చోరీ చేసిన బంగారు ఆభరణాలను కరిగించి బంగారు బిస్కెట్లుగా తయారుచేసి హైదరాబాద్‌లో అమ్ముతుండేవాడు. సోషల్ మీడియాలో బంగారం కరిగించడం ఎలాగో తెలుసుకొని.. ఆన్లైన్లో బంగారం కరిగించే పరికరాలను సోహెల్ ఖాన్ కొనుగోలు చేశాడు. అలా మోస్ట్ వాంటెడ్ దొంగ సోహెల్ ఖాన్ ఏపీ, కర్ణాటక, తెలంగాణ పోలీసులకు పగలే దొంగతనాలకు పాల్పడుతూ సవాలు విసిరాడు. పక్కా సమాచారంతో పెనుకొండ పోలీసులు మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగ సోహెల్ ఖాన్‌ను తుముకూరులో అతని ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. సోహెల్ ఖాన్ దగ్గర 350 గ్రాముల బంగారం బిస్కెట్లతో పాటు ఇంటి తాళాలు పగలగొట్టేందుకు ఉపయోగించే పరికరాలు, బంగారం కరిగించే మిషన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోహెల్ ఖాన్ చేసిన దొంగతనాలన్నీ కూడా పట్ట పగలే చేయడంతో.. ఇలా ఎందుకని పెనుకొండ పోలీసులు విచారణలో అడగ్గా.. తనకు కంటి సమస్య ఉందని.. సాయంత్రం 6 దాటితే రేచీకటితో కళ్ళు కనిపించవని సోహెల్ ఖాన్ చెప్పడంతో.. వారంతా షాక్ అయ్యారు. దీంతో సోహెల్ ఖాన్ అందరి దొంగల మాదిరిగా కాకుండా.. రేచీకటి దొంగగా పోలీసులను ఆశ్చర్యానికి గురి చేశాడు. సోహెల్ ఖాన్ గురించి తెలిసిన పోలీసులు వీడెక్కడి రేచీకటి దొంగ రా బాబు అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి