Anantapur district: రూపాయికే దోసె.. సావిత్రమ్మా.. నీ మనసు ఎంత గొప్పది అమ్మా..!

|

Jan 23, 2022 | 6:45 PM

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కాల్వగడ్డ వీధికి చెందిన సావిత్రమ్మ ఒక్క రూపాయికే దోశ విక్రయిస్తోంది. సుమారు 40 ఏళ్లుగా ఆమె నామమాత్రపు ధరకు దోశలు, వడలు, పొంగనాలు అమ్ముతోంది.

Anantapur district:  రూపాయికే దోసె.. సావిత్రమ్మా.. నీ మనసు ఎంత గొప్పది అమ్మా..!
Re 1 Dosa
Follow us on

Savitramma Dosa:హోటల్‌లో దోసె తినాలంటే 20 నుంచి 50 రూపాయలు పెట్టాల్సిందే.. కానీ ఓ వృద్ధురాలు రూపాయికే దోసె అమ్ముతూ సామాన్యుల ఆకలి తీరుస్తోంది. ఎర్రకారం, బొంబాయి చట్నీతో ఆమె అందించే దోసె తింటుంటే ఎంతో రుచిగా, తృప్తిగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నా రూపాయికే దోసె విక్రయిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది తాడిపత్రికి చెందిన సావిత్రమ్మ అనే వృద్ధురాలు. తను లాభాలకోసం ఈ వ్యాపారం చేయడంలేదని, ఇలా పేదల కడుపునింపుతూ తనకు కూలి గిట్టుబాటు అయితే చాలంటోంది ఈ వృద్ధురాలు.

కర్నూలుజిల్లా కొలిమిగుండ్ల మండలానికి చెందిన సావిత్రమ్మ దాదాపు 45 ఏళ్ల క్రితం భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం తాడిపత్రి పట్టణానికి వచ్చారు. సావిత్రమ్మ భర్త వెంకట్రామిరెడ్డి. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. కాల్వగడ్డ వీధిలో 40 ఏళ్ల కిందట వెంకట్రామిరెడ్డి టీ బంకు పెట్టుకుని జీవనం సాగించేవాడు. అతనికి చేదోడుగా ఉంటుందని అతని భార్య సావిత్రమ్మ ఇంటి వద్ద బంకు ఏర్పాటు చేసుకుని దోసెలు వేయడం మొదలు పెట్టింది. ప్రారంభంలో దోసె ధర పావలా. వీధిలోని వారు, చుట్టుపక్కల పేదలు, విద్యార్థులు, పిల్లలు అందరూ సావిత్రమ్మ దగ్గరకు వచ్చి ఈ దోసెలు తినేవారు. 15 ఏళ్ల తరువాత దోసె ధరను 50 పైసలకు పెంచి వ్యాపారం కొనసాగించింది. తరువాత కొన్నాళ్లకు భర్త అనారోగ్యం బారిన పడి మృతి చెందాడు. కుటుంబ పోషణ భారం మొత్తం సావిత్రమ్మపైనే పడింది. తన సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఇటీవల కాలంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో దోసె ధరను రూపాయికి పెంచింది. ఎర్రకారం, బొంబాయి చట్నీ కాంబినేషన్‌లో సావిత్రమ్మ వేసే దోసెను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అదేవిధంగా సాయంత్రం రూ.10కు ఆరు బజ్జీలు, రూ.10కి 10 పొంగనాలు విక్రయిస్తోంది. ఇలా రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకూ సంపాదిస్తున్నట్లు సావిత్రమ్మ తెలిపింది.  ఇప్పుడు సావిత్రమ్మ వయసు 70 సంవత్సరాలు.  తన కష్టానికి దక్కిన ఆదాయంతోనే ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు చేయడం విశేషం. పేదలు, సామాన్యులకు అతి తక్కువ ధరలో దోసె విక్రయిస్తూ కడుపు నింపుతున్నానన్న ఆనందం చాలని అంటోంది.

Also Read: Viral: రైతా.. మజాకా..! కారు రూ.10 కాదంటూ అవమానించిన సేల్స్​మ్యాన్​.. గంటలో దిమ్మతిరిగే షాక్