
దొంగలు పలు రకాలు.. బంగారం కొట్టేసేవారు కొందరైతే.. బైకులు కొట్టేశారు మరికొందరు. ఒక్కొక్కడు ఒక్కో స్టైల్‌లో దొంగతనం చేస్తుంటారు. అయితే దొంగతనానికి వెళ్లిన దొంగలు.. కొన్నిసార్లు వింత పనులు చేస్తూ.. వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. కొంతమంది దొంగలు.. కాసేపు పడుకుని వెళ్దాం అనుకుని ఏసీ వేసుకుని పడుకుని.. తెలివి రాక అడ్డంగా బుక్కవుతారు. మరికొందరు ఇంట్లో ఏం దొరకపోతే తమ వద్ద ఉన్న 100, 50 అక్కడ పెట్టి పండగ చొస్కోండి అని రాసి వెళ్ళిపోతారు. ఇంకొందరు దొంగతానికి వెళ్లిన ఇంట్లోనే వంటావార్పు లాంటి కథలు పడుతుంటారు. ఇలాంటి ఘటనలు అడపాదడపా చోటుచేసుకుంటూ ఉంటాయి. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరులో దొంగలు అలాంటి వింత పనే చేశారు.
పట్టణంలోని మారుతినగర్‌లో ఓ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగలు.. బంగారం, నగదు, మూడు సిలిండర్లను ఎత్తుకెళ్లారు. అయితే వారు వంటగదిలోకి వెళ్లిన సమయంలో.. శనగపిండి, మిర్చి కనిపించడంతో ఎంచక్కా వేడివేడిగా బజ్జీలు వేసుకుని తిన్నారు. బజ్జీలు వేసిన తర్వాత ఆ స్టవ్‌కి ఉన్న గ్యాస్ బండ సైతం పట్టుకెళ్లిపోయారు. ఈ దొంగల యవ్వారం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక ఇంటి యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. దొంగల కోసం వేట షురూ చేశారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..