పశ్చిమగోదావరి, నవంబర్08; సంక్రాంతి వస్తుందంటే ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు.. కోడి పందాలు లేకపోతే అసలు పండగే లేనంతగా పరిస్థితి మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా, దేశంలోనే వివిధ రాష్ట్రాలు, దేశ విదేశాలను నుండి సైతం కోడిపందాల చూసేందుకు ఇక్కడికి వస్తుంటారు. అటువంటి పందెం కోళ్లను పెంచుతున్న పెంపకం దారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారు అంతగా ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి… ఎందుకు వచ్చాయి వారి ఆందోళనకు ముఖ్య కారణం ఏమిటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాలో భారీ ఎత్తున కోడిపందాలు జరుగుతాయి. పండుగ మూడు రోజులు పందాల పేరుతో కోట్ల రూపాయల నగదు చేతులు మారుతుంది. అంత విలువైన పందాల కోసం పోటీపడే పందెం కోళ్ళు సైతం లక్షల రూపాయల విలువ కలిగి ఉంటాయి. ఒక జాతి పందెంకోడి తయారీకి సుమారు రూ 25 వెలు వరకు ఖర్చు అవుతుంది. అలా తయారు చేసిన కోడిపుంజులను వాటి రంగు, పోరాట పటిమ, వాటి ఎత్తు ఇలా అనేక రకాలుగా వాటిని వేరుచేసి సుమారు రూ.50 వేల నుంచి రూ. 5లక్షల వరకు వాటిని అమ్ముతారు. ప్రస్తుతం చాలా చోట్ల పందెంకోడి పుంజుల పెంపకం జీవనాధారంగా మారింది. అలా వాటిపై జీవిస్తున్న పలువురుకి కొందరు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనతో వారు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇటీవల పందెం పుంజులు దొంగతనాలు జోరుగా సాగుతున్నాయి. ఎంతో కష్టపడి గుడ్డు దశ నుంచి పొదిగిన తర్వాత ఒకరోజు పిల్ల దగ్గర నుంచి సుమారు ఒక సంవత్సరం కాలం వరకు వాటిని పెంచి పోషించి, వాటికి బలవర్ధకమైన ఇస్తూ, యుద్ధ నైపుణ్యంలో తర్ఫీది ఇచ్చిన కోడిపుంజులను రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళుతున్నారు. అందులో మరీ ముఖ్యంగా సంక్రాంతికి రెండు నెలల ముందు ఈ పందెంకోడి పుంజుల దొంగతనాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. దాంతో ఎంతో శ్రమించి, వాటిని పెంచి, వాటి పెంపకంపై లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పందెం పుంజుల పెంపకం దారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నూజివీడు పరిసర ప్రాంతాల్లో పందెం పుంజుల దొంగతనాలతో పెంపకం దారులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.
నూజివీడు మండలం రావిచర్ల గ్రామానికి చెందిన మోత్కుమిల్లి శ్రీనివాసరావు ఎంఎస్పీ కాలవ సమీపంలో ఓ పొలంలో ఎంతో ఖరీదైన జాతి కోడిపుంజులను పెంచుతున్నారు. రాత్రి పగలు కూడా శ్రీనివాసరావు అతని భార్య రాత్రి పగలు కూడా వాటిని సంరక్షిస్తూ అక్కడే నివసిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సమీపించడంతో ఇప్పటికే కొన్ని కోడిపుంజులకు పందేలలో తర్ఫీదు తో పాటు, వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఆ కోళ్లపై దొంగల ముఠా కన్ను పడింది. భార్యాభర్తలు ఇద్దరే మకాం దగ్గర ఉండటం వారు గమనించారు. అంతేకాక ఆ కోళ్ల మకాం కూడా ఊరికి దూరంగా ఉండటంతో చోరీకి ప్లాన్ చేశారు.. రెండు బైకులు, ఆటో వేసుకుని అంత రాత్రి శ్రీనివాసరావు కోళ్ల మకాం దగ్గరకు వెళ్లి భార్యాభర్తలు ఇరువురి గొంతు పై కత్తి పెట్టి బెదిరించారు.. వారు మకాంలో పెంచుతున్న సుమారు రూ.4 లక్షల విలువగల 11 జాతి పుంజులను ఆటోలో వేసుకుని అక్కడ నుంచి పరారయ్యారు. కోళ్ల దొంగతనం ఘటనపై బాధితులు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీనివాసరావు అతనీ భార్య పద్మావతిని దొంగతనం జరిగిన తీరును గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారు తమ వెంట కత్తులు తీసుకువచ్చి తమ గొంతు పై పెట్టి చంపేస్తామని బెదిరించి కోళ్లను అపహరణ చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పందెం పుంజుల తయారీ ఎంతో కష్టమైన పని. ముందుగా విశాలమైన ప్రాంతంలో షెడ్లు వేసి వాటి పెరుగుదలకు కావలసిన పరిస్థితులు అక్కడ కల్పించాలి. ఆ తరువాత శ్రేష్టమైన బ్రీడర్ జాతులకు చెందిన కోళ్ల నుంచి వచ్చిన గుడ్లను పొదిగించి పిల్లలను తయారు చేస్తారు. ఇటీవల కాలంలో విదేశీ కోడి పుంజుల బ్రిడర్ లైన పేరు, ఫిలిపైన్ జాతులకు మన ఏరియాలో మంచి డిమాండ్ ఉంది. మన దేశీయ బ్రీడర్లతో పాటు విదేశీ బ్రిడర్లను సైతం పెంపకందారులు పెంచుతున్నారు. అలా ప్రత్యేకంగా సెలెక్ట్ చేసిన కోడి పుంజులను చిన్నతనం నుండే మంచి పోషకాలు గల ఆహారంతో పాటు, వాటికి వ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు డాక్టర్లతో పర్యవేక్షిస్తూ కంటికి రెప్పలా కాపాడుతారు. దాంతో కోళ్ల పెంపకం దారులకు ఒక్కొక్క పుంజు వేల రూపాయల ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు పెట్టి తయారుచేసిన పుంజులను సంక్రాంతికి ముందు అమ్ముకునీ లాభాలు ఆశించే సమయంలో కోళ్ల దొంగలు వారి ఆశలపై నీళ్లు జరుగుతున్నారు. ఆలాంటి వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెంపకం దారులు కోరుతున్నారు.
ఇటీవల నూజివీడులో జరిగిన పందెం కోళ్ళ చోరీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాక దొంగల కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తుల చేపట్టారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని బాధితులకు భరోసా ఇస్తూ వారికి పలు సూచనలు చేస్తున్నారు. పందెం కోళ్ల పెంపకం దారులు తమ కోళ్ల మకాం ల వద్ద రక్షణగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు, అదేవిధంగా సంక్రాంతి సీజన్ సమీపించడంతోపాటు ప్రస్తుతం పదెం కోళ్లకు మంచి డిమాండ్ ఉండడంతో కాపలా కట్టుదిట్టం చేసుకోవాలని, అదేవిధంగా పందెం కోళ్ళ మకాముల వద్ద ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలని పోలీసులు అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..