Prakasam: నెరవేరనున్న దశాబ్దాల నాటి కల

| Edited By: Velpula Bharath Rao

Oct 09, 2024 | 9:13 PM

ప్రకాశం జిల్లాలో కొత్త రైలు మార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నడికుడి నుంచి దర్శి, పొదిలి, కనిగిరి మీదుగా శ్రీకాళహస్తి వరకు సాగుతున్న కొత్త రైల్వే నిర్మాణ పనులు ప్రస్తుతం పొదిలి వరకు పూర్తయ్యాయి. పొదిలిలో నూతన రైల్వే ట్రాక్‌ నిర్మించి ట్రయల్ రన్‌లో భాగంగా లోకోపైలెట్‌ రైలును నడపడంతో పొదిలి ప్రాంతవాసులు రైలును చూసేందుకు ఆసక్తి చూపించారు.

Prakasam: నెరవేరనున్న దశాబ్దాల నాటి కల
New Railway Line
Follow us on

ప్రకాశం జిల్లాలో కొత్త రైలు మార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నడికుడి నుంచి దర్శి, పొదిలి, కనిగిరి మీదుగా శ్రీకాళహస్తి వరకు సాగుతున్న కొత్త రైల్వే నిర్మాణ పనులు ప్రస్తుతం పొదిలి వరకు పూర్తయ్యాయి. పొదిలిలో నూతన రైల్వే ట్రాక్‌ నిర్మించి ట్రయల్ రన్‌లో భాగంగా లోకోపైలెట్‌ రైలును నడపడంతో పొదిలి ప్రాంతవాసులు రైలును చూసేందుకు ఆసక్తి చూపించారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కల త్వరలోనే నెరవేరబోతోందని సంతోషం వ్యక్తం చేస్తునర్నారు. నడికుడి నుంచి దర్శి, పొదిలి, కనిగిరి మీదుగా జరిగే ఈ రైల్వే ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి బ్రిడ్జ్‌, రైల్వేస్టేషన్‌ నిర్మాణ పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొదటి దశలో దర్శి వరకు, రెండో దశలో పొదిలి వరకు ట్రాక్‌ పనులు పూర్తయ్యాయి. మూడో దశలో పొదిలి నుంచి కనిగిరి వరకు పనులు జరుగుతున్నాయి. పొదిలి మండలంలోని రాజుపాలెం, బుచ్చనపాలెం, దాసర్లపల్లి, కాటూరివారిపాలెం మీదుగా పనులు పూర్తయ్యాయి.

పొదిలి సమీపంలోని రాజుపాలెం సమీపంలో రైల్వే స్టేషన్‌ నిర్మిస్తున్నారు. రైల్వేస్టేషన్‌కు సంబంధించి ఫ్లాట్‌ఫాంలు, భవనాల నిర్మాణం కొనసాగుతున్నాయి. మరో ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు కొత్త రైల్వే నిర్మాణం పనులు చేపట్టి ఇప్పటికి పదేళ్ళు దాటుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఈ ప్రాజెక్టు కూడా ఉంది. రైలు పట్టాల నిర్మాణం కోసం సేకరించిన భూములకు గాను చెల్లించాల్సిన పరిహారం విషయంలో కొంతమంది రైతులు కోర్టుకు వెళ్లడంతో పనుల్లో జాప్యం నెలకొంది. కోర్టుకు వెళ్ళిన రైతుల భూములను వదిలేసి మిగిలిన పనులు పూర్తి చేస్తున్నారు. రైతులతో కూడా మాట్లాడి పరిహారం సమస్యను కూడా పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నడికుడి నుంచి దర్శి వరకు రైల్వే పనులు పూర్తి కావడంతో ప్రస్తుతం నడికుడి నుంచి దర్శి వరకు రోజుకు రెండు రైళ్ళను నడుపుతున్నారు. ఏడు నెలలుగా రాకపోకలు సాగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా శావల్యాపురం నుంచి ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ, కురిచేడు మీదుగా దర్శి వరకు రైల్వే లైను నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం నడికుడి నుంచి దర్శి వరకు నడుపుతున్న రైళ్ళను పొదిలి వరకు కొనసాగించేలా అన్ని నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దీంతో పొదిలి వాసులు తెగ సంబరపడిపోతున్నారు.