ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో దూర ప్రాంతాల మధ్య సర్వీసుల కోసం ఏపీఎస్ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్సులు నడిపించాలని నిర్ణయించింది. వీటికి ఆకర్షణీయమైన, సరైన పేరు పెట్టాలని ప్రయాణీకులను కోరింది. ఈ మేరకు నాన్-ఏసీ స్లీపర్ బస్సుకు ‘స్టార్ లైనర్’ పేరును ఆర్టీసీ అధికారులు ఖరారు చేశారు. పేరు సూచించిన దంపతులకు క్యాష్ అవార్డుతో పాటు సత్కారం చేశారు. నాన్- ఏసీ స్లీపర్ బస్సుకు మంచి బ్రాండ్ నేమ్ సూచించాలని ఇటీవల ఒక ప్రకటనలో ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) కోరింది. ఈ ప్రకటనకు మంచి స్పందన వచ్చింది. చిత్తూరు జిల్లాకు చెందిన సుమతి, రెడ్డప్ప దంపతులు ‘స్టార్ లైనర్’ అనే పేరు సూచించి, బహుమతి గెలిచారు. పేరు సూచించిన దంపతులను ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు అభినందించారు. విజేతకు రూ.10 వేలు క్యాష్ అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో ఒక్కో బస్సులో 30 బెర్తులు, ప్రతి బెర్త్‌కు ఫ్యాన్, రీడింగ్ ల్యాంప్ ఉంటాయి. తమ బ్రాండ్ సర్వీసు తెలిపేలా మంచిపేరును సూచిస్తే, నగదు బహుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో స్టార్ లైనర్ పేరును ఖరారు చేశారు.
మరోవైపు.. వివిధ ప్రాంతాల నుంచి ఇతర ఊళ్లకు వెళ్లిన వారు స్వస్థలాలకు వచ్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పండుగకు అందరూ ఇళ్లకు వచ్చేలా ప్రత్యేక బస్సులు నడిపించాలని నిర్ణయించింది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మొత్తం 1,081 అదనపు బస్సులు నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో గతంలో మాదిరి 50 శాతం అదనపు ఛార్జీలు కాకుండా సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..