Chicken Prices: పండగ వేళ అందనంత స్థాయికి నాటుకోడి ధరలు.. కేజీ ఎంతో తెలిస్తే షాక్.. రూ.వేలు ఖర్చు పెట్టాల్సిందే

Country Chicken: చికెన్ ధరలు తగ్గనంటున్నాయి. ఇప్పటికే బాయిలర్ చికెన్ ధరలు ఆమాంతం పెరిగాయి. కేజీ చికెన్ ధర రూ.320 వరకు పెరిగాయి. వీటికి పోటీగా నాటుకోళ్ల ధరలు కూడా ఆకాశాన్నంటున్నాయి. పండుగ వేళ ఏకంగా కేజీ నాటుకోడి రూ.2,500 వరకు పెరిగింది.

Chicken Prices: పండగ వేళ అందనంత స్థాయికి నాటుకోడి ధరలు.. కేజీ ఎంతో తెలిస్తే షాక్.. రూ.వేలు ఖర్చు పెట్టాల్సిందే
Country Chicken

Updated on: Jan 08, 2026 | 11:53 AM

Chicken Cost: సంక్రాంతి పండుగ వస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో నాటుగోళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. పండుగ సందర్భంగా ప్రజలు మాంసం ఎక్కువ తింటూ ఉంటారు. బాయిలర్ చికెన్ కంటే నాటుకోడి చికెన్ తినేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే పండుగ సందర్భంగా కనుమ రోజు గ్రామ దేవతలకు నాటుకోళ్లను మొక్కులుగా చెల్లిస్తారు. అలాగే ఇంటికొచ్చే అతిధులకు నాటుకోళ్లతో రకరకాల వంటకలు వడ్డిస్తారు. దీంతో ప్రతీసారి సంక్రాంతి పండుగ సమయంలో నాటుకోళ్లకు బాగా డిమాండ్ ఉండటంతో వీటి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. సాధారణ రోజుల్లో కేజీ రూ.వెయ్యి ఉండే నాటుకోడి ధర.. పండుగ సమయాల్లో రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఉంటుంది. ఈ సారి చికెన్ రేట్లు పెరగడం, నాటుకోళ్లను పెంచేవారు గ్రామాల్లో తగ్గిపోవడంతో వీటి ధర మరింతగా పెరిగింది.

కేజీ నాటుకోడి రూ.2 వేలు

ప్రస్తుతం సంక్రాంతి డిమాండ్ దృష్ట్యా కేజీ నాటుకోడి ధర రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. నాటుకోళ్లను పెంచేవాళ్లు తగ్గిపోవడంతో వీటి ఉత్పత్తి తగ్గిపోయింది. దీని వల్ల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నాటుకోళ్ల ధర భారీగా పలుకుతోంది. కేజీ మటన్ రూ.800 పలుకుతుండగా.. దానికి మించి నాటుకోళ్ల ధర ఉండటం విశేషం. పండక్కి నాటుకోడి మాంసం తినడం ఒక సంప్రదాయంగా భావిస్తారు. ఇక గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా నాటుకోడి ధరలు పెరిగాయి. కేజీ రూ.వెయ్యి వరకు చేరుకుంది. గ్రామాల్లో నాటుకోళ్లు దొరక్కపోవడంతో ఎక్కడ దొరుకుతాయో అని తెలిసినవారిని ఆరా తీస్తున్నారు. పుంజు కంటే పెట్టలను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు.

వైరస్ ప్రభావంతో ఎఫెక్ట్

ఇటీవల కోళ్లు వైరస్ బారిన పడి మరణిస్తున్నాయి. నాటుకోళ్లకు కూడా ఈ వైరస్‌లు సోకి మృత్యువాత పడుతున్నాయి. దీంతో పల్లెల్లో కోళ్లను పెంచేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీని వల్ల కూడా వాటి రేట్లు పెరుగుతున్నాయి. అటు పండుగ కారణంగా సరఫరా ఎక్కువగా ఉండటంతో బాయిలర్ చికెన్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేజీ స్కిన్‌లెస్ ధర రూ.320గా ఉంది. పండుగ సమయాల్లో రూ.350 వరకు కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పండక్కి చికెన్ ముద్ద నోట్లోకి వెళ్లాలంటే ఖర్చు ఎక్కువ పెట్టాల్సిందే.