Andhra Pradesh: పెళ్లి కార్డు పేరుతో ఇంటికొచ్చారు.. అప్పనంగా దోచుకుపోయారు.

| Edited By: Narender Vaitla

Jan 26, 2024 | 8:51 PM

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని తిలక్ నగర్ లో నివాసముంటున్న ఊన గోవింద్ పట్టణంలో ఓ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. వ్యాపార నిమిత్తం గురువారం గోవింద్, అతని భార్య బయటకు వెళ్లారు. ఆ సమయంలో గోవింద్‌ కుమార్తె రోహిణి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఆమె హైదరాబాదులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో...

Andhra Pradesh: పెళ్లి కార్డు పేరుతో ఇంటికొచ్చారు.. అప్పనంగా దోచుకుపోయారు.
Andhra Pradesh
Follow us on

ఇంట్లో అందరూ నిద్రలో ఉండగానో లేదా ఇంట్లో ఎవరూ లేకుండా తాళాలు వేసిఉన్న ఇళ్లలోకో దొంగలు చొరబడి చోరీలకు పాల్పడటం సాదారణoగా జరుగుతూనే ఉంటాది. బహిరంగ ప్రదేశాలలో మన ముందే మన దృష్టి మరల్చి దుండగులు దోపిడీలకు,దొంగతనాలకు పాల్పడిన ఘటనలు జరిగి ఉండవచ్చు. కానీ శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటి పరిధిలో గురువారం జరిగిన ఓ దోపిడీ జిల్లా వాసులను ఉలిక్కి పడేలా చేసింది. సినీ ఫక్కీలో దుండగులు పెళ్లి కార్డు పేరుతో బురిడీ కొట్టి ఇంటిలోకి చొరబడి రూ.1,50,000 దోచుకోవటం ఇపుడు అంతటా చర్చనీయాంశం అవుతోంది. వామ్మో ఇలా కూడా దోపిడీలకు పాల్పడే అవకాశం ఉందా అంటూ సభ్య సమాజం ఉలిక్కి పడేలా,ఆందోళన చెందేలా చేస్తోంది ఈ ఘటన.

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని తిలక్ నగర్ లో నివాసముంటున్న ఊన గోవింద్ పట్టణంలో ఓ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. వ్యాపార నిమిత్తం గురువారం గోవింద్, అతని భార్య బయటకు వెళ్లారు. ఆ సమయంలో గోవింద్‌ కుమార్తె రోహిణి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఆమె హైదరాబాదులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్.ఆర్ విభాగంలో పనిచేస్తున్నారు. సంక్రాంతి సెలవులకు స్వస్థలానికి వచ్చిన రోహిణి… సెలవులు ముగిశాక కూడా ఇంటి వద్ద నుoడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా గుర్తుతెలియని ఓ మహిళా, మరో వ్యక్తి భార్యాభర్తలు లాగా గురువారం మధ్యాహ్నం గోవింద్ నివాసానికి వచ్చారు. పెళ్లి కార్డు ఇవ్వటానికి వచ్చామని… తలుపులు తీయాలని ఇంట్లో ఒంటరిగా ఉన్న రోహిణిని కోరారు.

మీరెవరిని రోహిణి ప్రశ్నించగా… రోహిణి తండ్రి గోవింద్‌కు స్నేహితుడునని ఆ వ్యక్తి బదులు ఇవ్వటంతో తలుపులు తీసి లోపలకు ఆహ్వానించింది రోహిణి. అంతే లోపలికి ఇలా వచ్చారో లేదో ఆ ఇద్దరు ఆగంతకులు రోహిణిపై దాడికి దిగారు. మెడపై కత్తి పెట్టి ఇంట్లో డబ్బులు ఎక్కడ దాచి పెట్టారో తీసి ఇవ్వాలంటూ బెదిరించారు. ఇంట్లో డబ్బులు లేవంటూ రోహిణి చెప్పిన వినకుండా ఆమెపై దాడికి దిగారు. బెడ్రూంలోకి తీసుకువెళ్లి బీరువా తెరవాలంటూ బెదిరించి బలవంతంగా డోర్‌ తెరిపించారు. అనంతరం బీరువాలో వ్యాపార నిమిత్తం దాచిన 1,50,000 నగదును ఆగoతకులు తీసుకొని క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే చేరుకున్న రోహిణి తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో హుటాహుటిన ఇంటికి వచ్చిన గోవింద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇంట్లో రోహిణి ఒక్కరే ఉన్నట్టు రెక్కి ద్వారా తెలుసుకున్న ఆగంతకులు. ఇంటిలోని పరిస్థితిని ముందుగా తెలుసుకున్న ఆగంతుకులు పెళ్లి కార్డు పేరుతో బురిడీ కొట్టి ఇంట్లోకి చొరబడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరగడానికి 10 నిమిషాలు ముందే ఓ వ్యక్తి గోవింద్ నివాసానికి వచ్చాడు. అనాధ పిల్లల కోసం విరాళాలు సేకరిస్తున్నానని చెప్పి డబ్బులు గానీ ఇంట్లో పాత బట్టలు గాని ఉంటే ఇవ్వాలని కోరాడు. ఇంట్లో ఎవరూ లేరని, వెళ్ళిపోవాలంటూ ఇంట్లో నుంచి ఆ వ్యక్తిని రోహిణి చెప్పి పంపించేసింది. ఆ సమయంలో రోహిణి కన్విన్స్ చేసేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించినప్పటికీ ఆమె కుదరదు అని చెప్పటంతో ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికి ఓ మహిళ, ఓ వ్యక్తి గోవింద్ ఇంటికి వచ్చి ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. దీనిని బట్టి అనాధ పిల్లలకు విరాళాలు పేరుతో వచ్చిన వ్యక్తికి కూడా వీరితో సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి వచ్చి ముందుగా రెక్కి నిర్వహించినట్లు అనుమనిస్తున్నారు. అతను ఇచ్చిన సమాచారంతోనే ఇంట్లోకి చొరబడి దోపిడీకి పాల్పడినట్లు భావిస్తున్నారు పోలీసులు.

బాధితుల ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అఘాయిత్యoకి పాల్పడిన దుండగుల కోసం గాలిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీమ్ ను రప్పించి నిoదితుల వేలు ముద్రలు, ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలిసులు. మరోవైపు పట్టపగలే ఇంట్లో మనుషులు ఉండగానే దాడి చేసి దోపిడీ చేయటంతో పలాస కాశీబుగ్గ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాళాలు వేసుకుని ఇంట్లో ఉన్న ఇలా పెళ్లి కార్డు పేరుతో బురిడీ కొట్టి మరి లోపలికి చొరబడటంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అసలు తెలియటం లేదని అంటున్నారు స్థానికులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..