Jagan Bail Cancellation case : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ కేసు మళ్లీ వాయిదా పడింది. అక్రమాస్తుల కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై ఈ రోజు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఇప్పటికే రఘురామకృష్ణరాజు, వైఎస్ జగన్ లిఖిత పూర్వకంగా తమ వాదనలు సమర్పించారు. అయితే తాము కూడా లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పిస్తామని, అందుకు మరోసారి గడువు ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరింది. దీంతో విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
కాగా జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై ఈ నెల 14న కూడా విచారణ జరగగా తాము లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించేందుకు 10 రోజుల గడువు ఇవ్వాలని సీబీఐ కోరిన విషయం తెలిసిందే. సీబీఐ తీరుపై రఘురామ తరఫు న్యాయవాది ఆ సమయంలో అభ్యంతరాలు తెలిపారు. సీబీఐ తరచూ వైఖరి మారుస్తూ కాలయాపన చేస్తోందన్నారు. దీంతో కోర్టు ఆ సమయంలో ఈ నెల 26 (నేడు)కి విచారణను వాయిదా వేయడంతో నేడు విచారణ జరిగింది. అయితే, సీబీఐ మరింత సమయం కోరడంతో వాయిదా పడింది.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీఎం జగన్ ప్రస్తుతం బెయిల్‌పై బయటున్నారు. అయితే జగన్ బెయిల్ కండీషన్స్ ఉల్లంఘించారంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు రిజాయిండర్ కూడా వేశారు. తన కేసుల్లో తనతో పాటు నిందితులుగా ఉన్నవారికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ లబ్ది చేకూరుస్తున్నారని, సాక్ష్యులను బెదిరించేందుకు, ప్రభావితం చేసేందుకు పలు మార్గాల్లో ప్రయత్నించారని రఘురామ పిటిషన్‌లో వెల్లడించారు. జగన్ కు బెయిల్ ఇవ్వడం వల్ల బాధితులుగా మారినవారిలో తాను కూడా ఉన్నానని రఘురామకృష్ణరాజు వాదన.