
ఏపీలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా తీపికబురు అందించింది. కొత్త సంవత్సరం సందర్భంగా భారీ డిస్కౌంట్లతో చేనేత వస్త్రాలు అందించనుంది. న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని డిసెంబర్ 26వ తేదీ నుంచి తిరుపతిలో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఈ ఈవెంట్‌లో అతి తక్కువ ధరకే భారీ డిస్కౌంట్లతో చేనేత వస్త్రాలను విక్రయించున్నారు. ఏకంగా 40 నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏపీ చేనేత, జౌళిశాఖ మంత్ర సవిత ప్రకటించారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.
ఇక తిరుపతిలోనే కాకుండా మంగళగిరి, గుంటరులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కౌంటర్ల ద్వారా 60 శాతం డిస్కౌంట్‌తో చేనేత వస్త్రాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించున్నారు. మంగళగిరిలోని యర్రబాలెంలో ప్రత్యేక కౌంటర్ ఉండనుంది. ఇక విజయవాడలో ఉన్న ఆప్కో షోరూమ్‌లో చేనేత వస్త్రాలపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనుండగా.. మిగిలిన షోరూమ్స్‌లో కొనుగోలు చేసేవారికి 40 శాతం డిస్కౌంట్ కల్పించనున్నారు. ఇక రాష్ట్రంలోని మహిళా సంఘాల నుంచి చేనేత వస్త్రాలు కొనుగోలు చేయనున్నట్లు మంత్రి సవిత పేర్కొన్నారు.
ఏపీలో ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయున్నారు. నిరుద్యోగ మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్స్, టైలరింగ్ వంటి వాటిల్లో ఉచితంగా శిక్షణ అందించనున్నారు. అలాగే ప్లేట్లు, కొవ్వోత్తుల తయారీలో కూడా నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చి స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో స్వయం ఉపాధి యూనిట్లను చాలామందికి మంజూరు చేశారు. వీటి ద్వారా చాలామంది లబ్ది పొందుతుండగా.. వారితో త్వరలో సమావేశం కాననున్నారు. వీరి ద్వారా ఎక్కువమంది స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించనున్నారు. లబ్దిదారుల వీడియోల ద్వారా అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.