ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండల తహశీల్దార్ కార్యాలయం వేదికగా టీడీపీ, వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. నువ్వెంతంటే నువ్వెంత అంటూ.. మాటల యుద్ధానికి దిగారు. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లారు. అదే సమయంలో వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు కూడా అక్కడకు చేరుకున్నారు. వారితోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చారు.
ఒకేసారి ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా ఒకరినొకరు తిట్ల దండకాన్ని అందుకున్నారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకున్నారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నంలో లాఠీలకు పనిచెప్పారు. చివరకు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.