
సుమారు నెల రోజుల క్రితం తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకులు మద్యం మత్తులో కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేశారు. పట్టణ సమీపంలో ముగ్గురు యువకులు కూర్చొని మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన కానిస్టేబుల్ ను పిలిచి అతనిపై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ ముగ్గురిని జాన్ విక్టర్, షేక్ బాబూలాల్, రాకేష్ గా గుర్తించారు. వీరంతా రౌడీ షీటర్ లడ్డూ అనుచరులుగా తేల్చారు. ఏకంగా కానిస్టేబుల్ పై దాడి చేయడాన్ని తీవ్ర నేరంగా భావించిన పోలీసులు వారి ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే ఇది జరిగిన నెల రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది.
ఈ ముగ్గురిని పోలీసులు ఎక్కడైతే దాడికి పాల్పడ్డారో అక్కడికే తీసుకెళ్లారు. రోడ్డుపై ముగ్గురిని వరుసగా కూర్చోబెట్టారు. కాళ్లు ముందుకు చాపించి అరికాళ్లపై కోటింగ్ ఇవ్వడంపై మొదలు పెట్టారు. పెద్ద లాఠీ తీసుకొని సిఐ రాములు నాయక్ మొదట ఇద్దరిపై విపరీతంగా కొట్టారు. ఆ తర్వాత త్రీ టౌన్ సిఐ రమేష్ బాబు మూడో యువకుడి కాళ్లపై లాఠితో కొట్టాడు. చుట్టూ అందరూ చూస్తుండగానే ముగ్గురిని పోలీసులు అరికాలి కోటింగ్ ఇచ్చారు. గత కొంతకాలంగా తెనాలిలో రౌడీ షీటర్లు వారి అనుచరుల ఆగడాలు శ్రుతిమించి పోయాయి. దీంతో పోలీసులు వారిలో భయం పుట్టించాలన్న ఉద్దేశంతోనే అరికాలి కోటింగ్ ఇచ్చినట్లు అంతా భావిస్తున్నారు.
అయితే ముగ్గురి యువకులపై పోలీసులు ధర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై చర్య తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి డిమాండ్ చేశారు. బహరంగంగా దాడి చేసి మానవ హక్కులను హరించిన వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తం మీద పోలీసులు అరికాలి కోటింగ్ ఇచ్చిన వీడియో బయటకు రావడం, సోషల్ మీడియాలో వైరల్ కావడం జిల్లాలో కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి