ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఎన్నికల వేడి రాజకుంది. వచ్చే నెలలోనే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. మరి ఎన్నికలంటే మామూలు విషయం కాదుగా.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలు ముందు నుండే ఉచిత హామీలు ఇస్తుంటాయి. మరోవైపు చిన్న చిన్న బహుమతుల పంపిణీ జరుగుతుంటుంది. అయితే ఎన్నికల కమీషన్ అన్ని జాగ్రత్తగా గమనిస్తుంటుంది. కనుక అభ్యర్ధులు తగిన జాగ్రత్తులు తీసుకుంటుంటారు. ఇక్కడి మీటింగ్ కు అదే ఉద్దేశం ఉంది.
గుంటూరు నగరంలోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే నల్లచెరువులో మహిళలతో కూడిన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద ఎత్తునే మహిళలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి పార్టీలకు సంబంధం లేదు. మన్నవ మోహన క్రిష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ తరుపున సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన వారందరికి కుక్కర్లను రిటర్న్ గిప్టుల రూపంలో పంచి పెట్టారు. మహిళలు వంట చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో కుక్కర్లు పంచి పెట్టారు.
అయితే ఈ కార్యక్రమానికి ఎన్నికలకు సంబంధం ఉందని అక్కడకు వచ్చిన వారు చెప్పుకుంటున్నారు. మన్నవ మోహన క్రిష్ణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ వచ్చినా రాకున్నా తన ట్రస్ట్ తరుపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. గత దసరా సమయంలోనూ మహిళకు నిత్యవసర వస్తువులు పంపిణీకి సిద్దమయ్యారు. అయితే పార్టీ కార్యక్రమంగా నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రద్దు చేసుకున్నారు. ఇక, పార్టీ కార్యక్రమంగా చేయడానికి అనుమతి రాదనే ఉద్దేశంతో ఛారిటబుల్ ట్రస్ట్ తరుపున కార్యక్రమం ఏర్పాటు చేసి కుక్కర్లు పంచి పెట్టారు.
ఏది ఏమైనా ఇప్పడి నుండే ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా అభ్యర్ధులు అడుగులు వేస్తున్నారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. సాధారణంగా ఈ తరహా బహుమతుల పంపిణీ తమిళనాడు రాష్ట్రంలో అధికంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏపీలో కూడా బహుమతుల పంపిణీ మొదలు కావడంతో రానున్న రోజుల్లో ఈ బహుమతుల్లో ఇంకా ఏమేమి చేరుతాయో అన్న చర్చ ఇప్పటి నుండే నడుస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…