Janasena Varahi Yatra: ఏపీలో ఈసారి సంకీర్ణ సర్కారే.. వారాహి నాలుగో విడతలో ఎక్స్‌ట్రా జోష్.. ఆచితూచి మాట్లాడిన జనసేన అధ్యక్షుడు

|

Oct 01, 2023 | 10:02 PM

Janasena Varahi Yatra 4th Phase: ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇకమీదట ఇంకో లెక్క... గత మూడు యాత్రలూ ఒక ఎత్తు.. నాలుగో యాత్ర ఒక్కటీ ఒక ఎత్తు... అంటూ వారాహి యాత్ర నాలుగో విడత టూర్‌లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. వైసీపీ వాళ్ల దగ్గర ఉన్నట్టు తమ దగ్గర కిరాయి సైన్యం లేదని, అయినా కురుక్షేత్రానికి సిద్ధమేనని సవాల్ విసిరారు. కానీ, చిన్న ఛేంజ్.. మేం పాండవులం.. మీరు కౌరవులు అంటూ ట్విస్ట్ ఇచ్చారు. రాసిపెట్టుకోండి రాబోయేది జనసేన-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమే..

Janasena Varahi Yatra: ఏపీలో ఈసారి సంకీర్ణ సర్కారే.. వారాహి నాలుగో విడతలో ఎక్స్‌ట్రా జోష్.. ఆచితూచి మాట్లాడిన జనసేన అధ్యక్షుడు
Janasena Chief Pawan Kalyan
Follow us on

వారాహి యాత్ర గత మూడు దశల్లో గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రను చుట్టేసిన పవన్.. నాలుగో విడతను రాష్ట్రం నడిగడ్డ క్రిష్ణా జిల్లాకు కేటాయించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన తర్వాత తొలిసారిగా జనంలోకి వెళ్లారు గనుక.. ఈ యాత్రపై సహజంగానే ఫోకస్ పెరిగింది. పవన్ ఏం మాట్లాడతారు.. పొత్తుపై మిగతా విషయాల్లో ఏమేం క్లారిటీ ఇస్తారన్న ఆసక్తి మిగతా పార్టీల్లోనూ కనిపించింది.

వారాహి యాత్ర నాలుగో దశ మొదటిరోజున అవనిగడ్డలో బహిరంగసభ నిర్వహించింది జనసేన. జనసేనతో పాటు తెలుగుదేశం శ్రేణులు కూడా కదలి వచ్చారు. రెండు పార్టీల జెండాలతో మధ్యాహ్నం నుంచి సందడి వాతావరణం కనిపించింది. ప్రత్యేక పరిస్థితుల్లో మద్దతుగా నిలబడ్డ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు అంటూ ప్రసంగం మొదలుపెట్టారు పవన్‌కల్యాణ్. సీఎం చెబుతున్నట్టు ఇప్పుడు జరుగుతున్నది కురుక్షేత్రమేనని, కానీ.. మీరే కౌరవులు, మేము పాండవులం అంటూ సెటైరేశారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రధాన హామీల్ని మరిచారంటూ జగన్‌పై విమర్శలందుకున్నారు పవన్. ఈసారి ఓట్లు చీలడమనే పొరపాటు జరగనివ్వకుండా చూస్తామని, ఈసారి వైసీపీ ఓటమే మన లక్ష్యమని రెండు పార్టీల క్యాడర్‌కూ ఉమ్మడిగా పిలుపునిచ్చారు పవన్.

తనను ఎక్కడికక్కడ ఆపేస్తూ, తన స్వేచ్ఛను అపహరించారని, తన సినిమాల్ని ఆపి, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని, ఐనా ప్రధాని మోదీ దగ్గర తాను కంప్లయింట్ చెయ్యలేదన్నారు జనసేన అధ్యక్షుడు.

మెగా డీఎస్‌సీ కోరుతూ వారాహి సభా ప్రాంగణంలో ఆందోళన చేశారు నిరుద్యోగులు. ప్రస్తుతం 50 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, డీఎస్సీ కోసం లక్షలమంది యువతీయువకులు ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మెగా డీఎస్‌సీ వచ్చేలా చూడాలని జనసేన అధ్యక్షుడిని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని మాటిచ్చారు పవన్.

నాలుగు రోజులు క్రిష్ణా జిల్లాలోనే ఉండబోతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్. ఇవాళ బహిరంగసభ తర్వాత మచిలీపట్నం చేరుకుంటారు. రెండురోజులు బందరులోనే ఉంటూ పార్టీనేతలతో సమావేశాలు, జనవాణి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 4న పెడన, ఐదున కైకలూరులో వారాహి యాత్ర కొనసాగుతుంది. అటు.. ఆంధ్రాకు జగన్ వద్దేవద్దు.. అనే స్లోగన్‌తో ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది జనసేన. జగన్ ఎందుకు వద్దో ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.

పవన్‌ వారాహి యాత్రకు సంఘీభావం ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. సంపూర్ణ మద్దతు నిస్తున్నామని, తమ పార్టీ శ్రేణులు పూర్తిగా సహకరిస్తారని.. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం తర్వాత చెప్పారు బాలక్రిష్ణ. రెండు పార్టీల నుంచి చెరో ఐదుగురు సభ్యులతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అటు… తెలుగుదేశం పార్టీ మద్దతునివ్వడంతో వారాహి యాత్ర నాలుగో విడతలో జనం గతం కంటే ఎక్కువమంది వచ్చినట్టు జనసేన వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇదే వారాహి యాత్రలో జరిగే మిగతా సభల్లో పవన్ మరింత దూకుడు పెంచి.. ప్రభుత్వంపై ఆరోపణలు సంధించే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం