ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై అగ్రనేతల కసరత్తు కొనసాగుతోంది. గోదావరి జిల్లాల తర్వాత జనసేన ప్రభావం ఎక్కువగా ఉండేది ఉమ్మడి కృష్ణాలోనే.. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థుల గెలుపుపై జనసేన ఎఫెక్ట్ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలుండగా నూజివీడు, కైకలూరు స్థానాలు ఏలూరు జిల్లాలోకి వెళ్లిపోయాయి. ఇక మిగిలిన 14 స్థానాల్లో ఏడు నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో మరో ఏడు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. అయితే కృష్ణా జిల్లాలో ఉన్న అవనిగడ్డ, పెడన స్థానాలను జనసేన ఆశిస్తోంది.
అవనిగడ్డలో జనసేన పార్టీకి ఇన్‌ఛార్జ్ లేకపోయినప్పటికీ ఇక్కడ చాలా బలమైన కేడర్ ఉంది. సామాజిక వర్గాల పరంగా కూడా జనసేనకు మంచి బలం ఉంది. కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ మొదటిసారి ఈ నియోజకవర్గంలోనే వారాహి యాత్ర నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రాము అవనిగడ్డ టిక్కెట్ ఆశిస్తున్నప్పటికీ, టీడీపీ నుంచి సీనియర్ నేత మండలి బుద్ధ ప్రసాద్ రేసులో ఉన్నారు. ఇప్పటికే ఈ స్థానం తనకు కన్ఫర్మ్ అయిందని బుద్ద ప్రసాద్ చెప్పుకుంటున్నారు. మరి ఈ సీటు విషయంలో ఇరు పార్టీల అధినేతలు ఏం నిర్ణయం తీసుకుంటారనన్న ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు పెడన స్థానంలోనూ టీడీపీ, జనసేన బలంగా ఉన్నాయి. పెడనలో గతంలో జనసేన ఇన్‌ఛార్జ్‌గా ఉన్న యడ్లపల్లి రామ్ సుధీర్ వైసీపీలో చేరారు. దీంతో ఇటీవల ఇన్‌ఛార్జ్‌గా పంచకర్ల రమేష్‌ను నియమించింది పార్టీ. జనసేన ఖచ్చితంగా గెలుస్తామని చెప్తోన్న స్థానాల్లో పెడన కూడా ఒకటి. ఇక ఇదే స్థానంలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కాగిత కృష్ణ ప్రసాద్, మరో టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ కూడా బరిలో ఉన్నారు. అయితే బూరగడ్డ వేదవ్యాస్ ఇటీవల పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. ఆయన జనసేనలో చేరి పెడన స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇక ఎన్టీఆర్ జిల్లాలో కీలకమైన స్థానం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. జనసేన ఇన్‌ఛార్జ్ పోతిన మహేష్ తనకు టిక్కెట్ వస్తుందని కొండంత ఆశతో ఉన్నారు. టీడీపీ నుంచి బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్‌లు తమకే టిక్కెట్లు ఇవ్వాలంటూ బలప్రదర్శనలకు కూడా దిగారు. బీసీ సామాజికవర్గం నేతలుగా పోతిన మహేష్, బుద్దా వెంకన్న రెండు పార్టీల నుంచి రేసులో ఉన్నారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్న స్థానంలో తనకే టిక్కెట్ ఇవ్వాలంటున్నారు జలీల్ ఖాన్. ఇటీవల పవన్ కల్యాణ్‌ను కలిసి ఉమ్మడి అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక మైలవరం నియోజకవర్గంలో కూడా జనసేన ప్రధాన కార్యదర్శి అక్కల గాంధీ కూడా తనకు టిక్కెట్ కావాలని కోరుతున్నారు. అయితే మైలవరం టికెట్ మాత్రం టీడీపీకే వెళ్లే అవకాశాలున్నాయి. మొత్తానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ సీటు ఎవరికి కేటాయిస్తారనేది త్వరలోనే క్లారిటీ రానుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..