Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్రాన్ని పునర్‌నిర్మించాల్సిన బాధ్యత టీడీపీకి ఉందన్నారు. అందుకోసం సమయాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయని.. వ్యాఖ్యానించారు. బయట జరుగుతున్న ప్రచారంపై స్పందించడం కరెక్ట్ కాదని, తానెక్కడా పొత్తుల గురించి మాట్లాడలేదని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. పొత్తుల గురించి నాయకుల్లో స్పష్టత ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలకు పలు సూచనలు చేశారు. నిత్యం ప్రజల్లోనే ఉండాలని.. వారి సమస్యలపై స్పందించాలని చంద్రబాబు సూచించారు. చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచేసుకోవాలని, తాను కూడా మార్చుకుంటానని చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచే వైసీపీ ప్రభుత్వం దుర్మర్గంగా వ్యవహరిస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై నిలదీసిన వ్యక్తులను, పార్టీలను అణిచివేతకు గురిచేస్తుందన్నారు. దమ్ముంటే పోలీసులను పక్కన పెట్టి రావాలని సీఎం జగన్‌కు సవాల్ చేశారు చంద్రబాబు. అప్పుడు వైసీపీనో, టీడీపీనో తేలిపోతుందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థుల ఖరారు..
ఏపీలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీశ్రేణులు సన్నద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎన్నికలకు ఆయన అభ్యర్థుల పేర్లను కూడా వెల్లడించారు. పశ్చిమ రాయలసీమకు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, తూర్పు రాయలసీమ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ పేరును ప్రకటించారు. విశాఖకు త్వరలో పేరు ప్రకటిస్తామని వెల్లడించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం