టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు (Ashok Babu) అరెస్టుపై ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడిగా ఉద్యోగుల సమస్యలపై నిలదీస్తున్నందునే ప్రభుత్వం ఆయనపై కక్షకట్టిందన్నారు. సర్వీస్ విషయంలో తప్పుడు కేసు పెట్టి అశోక్ బాబును అరెస్టు చేశారని ఆరోపించారు. అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఈ సందర్భంగా టీడీపీ అధినేత ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్ ప్రభుత్వం చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని, చేసిన ప్రతి తప్పుకు మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. కాగా ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలపై సీఐడీ అధికారులు అశోక్‌బాబును గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.
అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అయితే పనిచేసే సమయంలో బీకాం డిగ్రీ చదవకపోయినా.. చదివినట్లు తప్పుడు పత్రాలు సమర్పించారని.. మరికొన్ని ఆరోపణలతో విజయవాడ వాసి మెహర్ కుమార్ లోకాయుక్తకు గతంలో ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన లోకాయుక్త వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. సమగ్ర దర్యాప్తు కోసం సిఐడికి ఫిర్యాదు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ గీతామాధురి ఇటీవల అశోక్ బాబుపై సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 477 ఏ, 465, 420 తదితర సెక్షన్ల కింద గత నెలలో టీడీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు సీఐడీ పోలీసులు.
Also Read:Sivakarthikeyan: తెలుగు మూవీ మొదలుపెట్టిన తమిళ్ హీరో.. శివకార్తికేయన్ సినిమా షూటింగ్ షురూ..
Anantapur: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చెరువులోకి దూకిన చైన్ స్నాచర్.. ఆతర్వాత ఏమైందంటే..