ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువు ఉన్నప్పటికీ 2024 ఎన్నికలపై విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని పార్టీ నాయకులు దూకుడు పెంచాలని సూచించారు. వచ్చే సంవత్సర కాలం పార్టీకి చాలా ముఖ్యమని, అలసత్వం వీడి ప్రణాళికతో పనిచేయాలని స్పష్టం చేశారు. అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం, సంతనూతలపాడు నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో భేటీ అయిన చంద్రబాబు ఈ మేరకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గాలపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా ఇన్‌ఛార్జ్‌లతో చంద్రబాబు మాట్లాడారు. పలు సూచనలు చేశారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో నేతలు, కార్యకర్తలు పాల్గొనడంతో పాటు స్థానిక సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏ నియోజకవర్గంలోనూ ఒక్క పని కూడా చేయలేదని, ప్రజల సమస్యలను జగన్ సర్కారు పూర్తిగా గాలికి వదిలేసిందని చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాలనే ఎజెండాగా మలుచుకుని ప్రజా క్షేత్రంలోనికి వెళ్లాలన్నారు.
కాగా.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులు ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఇంటింటికీ తిరుగుతూ సర్కార్ చేస్తున్న అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. అయితే కొందరు నేతల పనితీరుపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు తమ మీద ఆధారపడి ఉన్నాయని, వారికి న్యాయం జరగాలంటే తిరిగి అధికారంలోకి రావాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..