Andhra Pradesh: ఇంటినిండా చుట్టాలు.. రాత్రి 11గంటలకు నవవధువుకి ఫోన్.. అలా బయటకు వెళ్లిన ఆమె..

| Edited By: Shaik Madar Saheb

Jun 21, 2024 | 8:35 PM

Bride Anusha suspicious death: డిగ్రీ వరకు చదువుకున్న అనూష ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో గ్రామంలోనే తల్లిదండ్రులతో ఉంటుంది. అందరితో కలివిడిగా ఉంటూ సరదా సరదాగా గడిపేది. ఇదే గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ అనే యువకుడు అనూషకి మంచి స్నేహితుడు. ఆ పరిచయం దుర్గాప్రసాద్ తో మరింత చనువును పెంచింది.

Andhra Pradesh: ఇంటినిండా చుట్టాలు.. రాత్రి 11గంటలకు నవవధువుకి ఫోన్.. అలా బయటకు వెళ్లిన ఆమె..
Bride Anusha suspicious death
Follow us on

Bride Anusha suspicious death: ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది.. నవ వధువు అనుమానస్పద మృతి సంచలనంగా మారింది.. కన్నకుతూరు మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గజపతినగరం మండలం బంగారమ్మపేటలో జరిగిన నవ వధువు మృతి ఘటన కలకలం రేపింది. డిగ్రీ వరకు చదువుకున్న అనూష ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో గ్రామంలోనే తల్లిదండ్రులతో ఉంటుంది. అందరితో కలివిడిగా ఉంటూ సరదా సరదాగా గడిపేది. ఇదే గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ అనే యువకుడు అనూషకి మంచి స్నేహితుడు. ఆ పరిచయం దుర్గాప్రసాద్ తో మరింత చనువును పెంచింది. అలా దుర్గాప్రసాద్, అనూష కొన్నాళ్ళు సరదాగా ఉన్నారు.. వీరి ఇద్దరి మధ్య ఉన్న స్నేహంతో ఇద్దరు కలిసి ఫోటోలు, వీడియోలు కూడా దిగారు. ఆ తరువాత దుర్గాప్రసాద్ అనూషను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమై కుటుంబపెద్దలతో ప్రపోజల్ పెట్టాడు. అయితే అనూష తల్లిదండ్రులు దుర్గాప్రసాద్ తో పెళ్లికి నిరాకరించారు.

ఆ సమయంలోనే అదే గ్రామానికి చెందిన జగదీష్ అనే మరో యువకుడు కూడా అనూషకి స్నేహితుడే. జగదీష్ జమ్మూలో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. జగదీష్ కి, అనూష కి ఉన్న స్నేహంతో జగదీష్ అనూషను పెళ్లి చేసుకునేందుకు ప్రపోజల్ పెట్టాడు. జగదీష్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండటంతో అనూష తల్లిదండ్రులు కూడా జగదీష్ తో పెళ్లికి అంగీకరించారు. అలా జగదీష్ అనూషల పెళ్లి జరిగింది. వీరిద్దరు పెళ్లి చేసుకున్న తరువాత కొద్ది రోజులు ఇంటి వద్ద ఉన్న భర్త జగదీష్.. తరువాత ఉద్యోగరీత్యా జమ్మూ వెళ్లిపోయాడు. ఆ వివాహంతో దుర్గాప్రసాద్, అనూషల మధ్య గ్యాప్ వచ్చింది.

ఈ క్రమంలో కొద్ది రోజులు దుర్గాప్రసాద్, అనూషకు దూరంగానే ఉన్నాడు. తరువాత మళ్లీ దుర్గాప్రసాద్ అనూషకి దగ్గరయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే అనూష దుర్గాప్రసాద్ ను కలిసేందుకు నిరాకరించింది. దీంతో ఎలాగైనా అనూషను లొంగదీసుకోవాలని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. పెళ్లికి ముందు దిగిన ఫోటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని గ్రామస్తులతో పాటు భర్త జగదీష్ కు కూడా పంపిస్తానని అనూషను తరుచూ బెదిరిస్తుండేవాడు. తాను చెప్పింది చేయాలని, తాను రమ్మన్న దగ్గరకు రావాలని వేధించేవాడు. దుర్గాప్రసాద్ వ్యవహారశైలితో అనూష నిత్యం భయంతో కాలం గడుపుతుండేది.

ఈ క్రమంలోనే ఈ నెల 17న తమ గ్రామ దేవత పండుగ జరిగింది.. దీంతో పండుగ కోసం అనూష ఇంటికి ప్రక్క గ్రామాల నుండి కూడా బంధువులు వచ్చారు. అంతా సరదాగా ఉండగా రాత్రి 11 గంటలకు అనూషకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ తీసుకొని మాట్లాడుతూ బయటికి వెళ్ళింది అనూష. అలా వెళ్లిన అనూష ఎవరికి కనిపించలేదు, తిరిగి ఇంటికి కూడా రాలేదు. పండగ కావడంతో స్నేహితులు దగ్గర ఉండి ఉంటుంది అని అంతా అనుకున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికి అర్ధరాత్రి 12 గంటల సమయంలో అనూష సోదరుడు పశువులకు మేత వేసేందుకు వెళ్లాడు. అక్కడ మిగతాజీవిగా ఉన్న అనూషను చూసి భయంతో ఒకసారిగా ఉలిక్కిపడ్డాడు.

అయితే అనూష చనిపోయే ముందు తండ్రి, సోదరుడికి దుర్గాప్రసాద్ బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడని మేసేజ్ పెట్టింది. ఆ మేసేజ్ ఆధారంగా అనూషను దుర్గాప్రసాద్ హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అసలు అనూష ఎలా చనిపోయింది? హత్యా? ఆత్మహత్యా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.. అసలు వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని.. పోలీసులు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..