
విశాఖలో ఓ మహిళకు వింత అనుభవం ఎదురయింది. ఇన్‌స్టాలో.. తనకు తెలియకుండా తన ఫోటోలు పోస్ట్ అవుతున్నాయి. అవి కూడా మామూలు ఫోటోలు కాదు.. తన ఫోటోలను న్యూడ్‌గా మార్చి తనకే పోస్టింగులు వస్తున్నాయి. దీంతో అవాక్కైన ఆ మహిళ.. ప్రశ్నించేసరికి వీడియో కాల్ చేయాలని టార్చర్ మొదలైంది. ‘చెప్పినట్టు వినకపోతే.. నీ ఇన్‌స్టా ఫ్రెండ్ లిస్టులో ఉన్న వారందరికీ ఇవే ఫోటోలు షేర్ అవుతాయి’ అని వేధింపులు. దీంతో ఆ మహిళ ఆ ఫోటోలు చూసి.. వేధింపులతో తీవ్రంగా కృంగిపోయింది. వాడు టార్చర్ శృతిమించడంతో.. గుండె నిబ్బరం చేసుకొని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కట్ చేస్తే.. మూడు ఫేక్ అకౌంట్స్.! ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లను క్రియేట్ చేసి మహిళ ఫొటోలను మార్ఫ్ చేసి వేధిస్తున్న ముద్దాయిని చాకచక్యంగా పట్టుకున్నారు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు. సీపీ బాగ్చి ఆదేశాలతో నిందితుడిని ట్రాక్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఆ మహిళకు వేధింపుల నుంచి విముక్తి కల్పించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు తెలియని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేసి మహిళ ఫొటోస్ న్యూడ్‌గా మార్ఫ్ చేశారు. న్యూడ్ వీడియో కాల్ చేయాలని.. లేదంటే తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌కు పోస్ట్ చేస్తానని బెదిరింపులు చేశాడు. మహిళకు, గుర్తు తెలియని ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి తన ఫేస్‌తో అశ్లీలంగా మార్ఫ్ చేసిన ఫోటోస్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా న్యూడ్ వీడియో కాల్ చేయాలని టార్చర్ మొదలైంది. మాట వినకపోతే తన అశ్లీలంగా మార్ఫ్ చేసిన ఫొటోలను నీ ఫాలోవర్స్ అందరికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫార్వర్డ్ చేస్తానని బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి. దాంతో బాధితురాలు భయానికి గురై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్.. సాంకేతిక సహాయంతో ట్రాక్ చేశారు.
పోలీసు విచారణలో అనేక కీలక విషయాల వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు సాధారణ ఫోటోస్‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీస్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు. వాటిని టెలిగ్రామ్ అప్లికేషన్ ఉపయోగించి సాధారణ ఫోటోలను అశ్లీలంగా మార్ఫ్ చేశారు. తిరిగి వాటిని బాధితురాలు ఇన్‌స్టాగ్రామ్‌కి పంపించారు. చాకచక్యంగా సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని ట్రాక్ చేశారు. తాటిచెట్ల పాలెం సంజీవయ్య నగర్ కాలనీకి చెందిన నవీన్‌గా నిందితుడిని గుర్తించారు. మొబైల్ ఫోన్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను సీజ్ చేసి.. నిందితుడి నవీన్‌ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి కటకటాల వెనక్కి నెట్టారు.
ఎవరికైనా అపరిచిత వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో.. టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లో రిక్వెస్ట్ వచ్చినా యాక్సెప్ట్ చేయకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అలానే సోషల్ మీడియా అకౌంట్‌లను ప్రైవేటులో పెట్టుకోవాలని.. అపరిచిత వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. తెలియని వ్యక్తులతో సాన్నిహిత్యం వద్దని.. తెలియని లింక్‌పై క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కొరకు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in, లేదా టోల్ ఫ్రీ నెంబర్: 1930 లేదా కమిషనర్ ఆఫ్ పోలీస్ నెంబర్ 7995095799కు కాల్ చేసి ఫిర్యాదు చేయలని సూచించారు. విశాఖ సిటీ పోలీస్ వాట్సాప్ కంప్లైంట్ మొబైల్ 9493336633 నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి