శ్రీశైలం ఆలయ ప్రధాన భద్రతాధికారిపై వేటు.. వైరల్ ఆడియో వ్యవహారంలో కీలక పరిణామం

Srisailam Temple news: శ్రీశైలం ఆలయంలో దర్శనాల వ్యవహారంపై వైరల్‌గా మారిన ఆడియో నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆడియో వైరల్ కావడానికి కారణమయ్యారనే ఆరోపణలతో ఆలయ ప్రధాన భద్రతాధికారి శ్రీనివాసరావును అధికారులు టెర్మినేట్ చేశారు. మరోవైపు హుండీ చోరీ, ఉద్యోగులపై ACB కేసుల నేపథ్యంలో తిరుమల తరహాలో ప్రత్యేక విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

శ్రీశైలం ఆలయ ప్రధాన భద్రతాధికారిపై వేటు.. వైరల్ ఆడియో వ్యవహారంలో కీలక పరిణామం
Srisailam Temple

Edited By:

Updated on: Aug 21, 2026 | 2:56 PM

Srisailam Temple: శ్రీశైలం ఆలయంలో ఇటీవల దర్శనాల విషయంపై వైరల్‌గా మారిన ఆడియో వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ప్రధాన భద్రతాధికారి (CSO) శ్రీనివాసరావును అధికారులు టెర్మినేట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వైరల్‌గా మారిన ఆడియోకు CSO శ్రీనివాసరావే కారణమని గుర్తించిన అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దర్శనాల వ్యవహారానికి సంబంధించి శ్రీశైలం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు, శ్రీశైలం సీఐ జీవన్ మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆడియో ఆలయ వర్గాల్లోనే కాకుండా భక్తుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

వైరల్ ఆడియోపై విచారణ

ఆడియో వైరల్ కావడానికి గల కారణాలపై అధికారులు దృష్టి సారించారు. విచారణ అనంతరం ఆడియో వైరల్ కావడంలో CSO పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చిన అధికారులు శ్రీనివాసరావుపై చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయనను విధుల నుంచి టెర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

హుండీలో చోరీకి యత్నం.. ఆలయ భద్రతపై చర్చ

CSO టెర్మినేషన్ నేపథ్యంలో శ్రీశైలం ఆలయ భద్రత, బందోబస్తు వ్యవహారాలపై కూడా చర్చ మొదలైంది. ఆలయానికి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, శ్రీశైలం ఆలయ గర్భగుడిలోని హుండీలో చోరీకి పాల్పడుతున్న మైనర్లను సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన కూడా ఇటీవల కలకలం రేపింది. ఆలయ భద్రతా ఏర్పాట్లపై ఈ ఘటనతో మరోసారి ప్రశ్నలు తలెత్తాయి.

ఉద్యోగులపై ఏసీబీ కేసులు

మరోవైపు ఆలయంలో అవకతవకలకు పాల్పడిన పలువురు ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ (ACB) క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. వరుస పరిణామాల నేపథ్యంలో ఆలయ పరిపాలన, భద్రతా వ్యవస్థపై మరింత నిఘా అవసరమనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

తిరుమల తరహాలో ప్రత్యేక విజిలెన్స్ విభాగం..

శ్రీశైలం ఆలయంలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలను దృష్టిలో పెట్టుకుని తిరుమల తరహాలో ప్రత్యేక విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆలయంలో అక్రమాలు, అవకతవకలు, భద్రతా లోపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ప్రత్యేక వ్యవస్థ అవసరమని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. CSO టెర్మినేషన్, వైరల్ ఆడియో, హుండీ చోరీ ఘటన, ఉద్యోగులపై ACB కేసులు వంటి వరుస పరిణామాలతో శ్రీశైలం ఆలయ భద్రత, పర్యవేక్షణ వ్యవస్థపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us