Srikakulam Train Accident: ఒక రైలు నుంచి ప్రాణభయంతో కిందకి దిగినా మృత్యువు వారిని వెంటాడింది. క్షణాల్లోనే మరో రైలు వారిని బలి తీసుకుంది. చిమ్మచీకటి వారి జీవితాలను పూర్తిగా చీకటిమయం చేసింది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో ఘోరప్రమాదం జరిగింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఐదుగురు మృతిచెందారు. కోయంబత్తూరు నుంచి సీల్చెర్ వెళ్తున్న గౌహతి ఎక్స్‌ప్రెస్ లో పొగలు రావడంతో చైన్ లాగి రైలును నిలిపివేశారు ప్రయాణికులు. ఆతర్వాత పట్టాలు దాటుతుండగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందారు. గౌహతి ఎక్స్‌ప్రెస్ విశాఖ నుంచి వెళ్తుండగా, మరో ట్రైన్ పట్టాల నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎదురుగా వస్తున్న టైంలో ఈ ఘటన జరిగింది.
గౌహతి ఎక్స్‌ప్రెస్ సాంకేతిక సమస్యతో, బాతువా సమీపంలో నిలిచిపోయింది. దీంతో కొందరు ప్రయాణికులు రైలు దిగి, పట్టాలు దాటే ప్రయత్నం చేశారు. మరోవైపు నుంచి వచ్చే ట్రైన్‌ను గమనించకుండా పట్టాలు దాటుతుండగా, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరు గాయపడగా, వారిని రిమ్స్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన కలెక్టర్ ఆర్డీవో, తహసిల్దార్‌ను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. దీంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. మృతులంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను ఆముదాలవలస రైల్వేస్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్వస్థలాలకు తరలిస్తారు.
సీఎం జగన్ దిగ్భ్రాంతి..
రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక రైలు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని బాతువా గ్రామస్తులు తెలిపారు. గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు కిందకి దిగారని గ్రామస్తులు చెబుతున్నారు. రాత్రి 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం ఆరుగురు ట్రైన్ దిగి రైలు పట్టాలు దాటుతుండగా, మరో ట్రాక్ నుంచి వస్తున్న రైలు ఢీకొని ఐదుగురు చనిపోయారని, మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
Also read:
Investment: ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో మహిళలు ఎందుకు వెనకబడుతున్నారు.. కారణమేంటంటే..
విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..