Andhra News: ఉల్టా.. ప‌ల్టా అంటే ఇదేనేమో.. మద్యం షాపు లాటరి తీస్తుండగా…

| Edited By: Ram Naramaneni

Oct 14, 2024 | 3:30 PM

మద్యం షాపుల కేటాయింపు కోసం జరుగుతోన్న లక్కీ డ్రా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతోంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం గందరగోళానికి దారితీసింది. శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పర్యవేక్షణలో లక్కీ డ్రా జరుగుతుండగా ఆమదాలవలస సర్కిల్ పరిధిలోని 42వ మద్యం షాపు విషయానికి వచ్చేసరికి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Andhra News: ఉల్టా.. ప‌ల్టా అంటే ఇదేనేమో.. మద్యం షాపు లాటరి తీస్తుండగా...
Liquor Shop Licenses Lucky draw
Follow us on

ఏపీలో గత YCP ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రభుత్వ మద్యం దుకాణాలకు స్వస్తి పలికి కూటమి ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్ని తీసుకువచ్చింది. మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ కొత్త మద్యం పాలసీకి తిరిగి తెరలేపింది. అందులో భాగంగా మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి లక్కీ డ్రా ద్వారా షాపులను కట్టబెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఉదయం 8గంటల నుంచే జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కేటాయింపుకి సమందించి లక్కీ డ్రా ప్రారంభమైoది.

శ్రీకాకుళంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్కీ డ్రాలో గందరగోళం….

మద్యం షాపుల కేటాయింపు కోసం జరుగుతోన్న లక్కీ డ్రా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతోంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం గందరగోళానికి దారితీసింది. శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పర్యవేక్షణలో లక్కీ డ్రా జరుగుతుండగా ఆమదాలవలస సర్కిల్ పరిధిలోని 42వ మద్యం షాపు విషయానికి వచ్చేసరికి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 42వ దుకాణానికి సంబంధించి డ్రాలో 9వ నంబర్ వస్తే దానిని 6వ నంబర్ అని మైక్‌లో బహిరంగంగా అనౌన్స్ చేశారు అధికారులు. అయితే 6ను ఉల్టా చేస్తే 9 కూడా అవుతుంది. కాబట్టి అదే అనుమానం వచ్చి ఉన్నతాధికారులను క్రాస్ చేయమని కోరగా అది 6వ నంబర్ కాదు 9వ నంబర్ అని తేలింది. దాంతో అధికారులు వెను వెంటనే 9వ నంబర్ అని ప్రకటించారు. అయితే ముందుగా 6వ నంబర్ అని ప్రకటించటంతో ఉబ్బితబ్బిబ్బైన ఆ దరఖాస్తుదారుడు.. అధికారులు మళ్లీ లక్కీ డ్రా విజేత 9వ నెంబరుకి చెందిన వాడని ప్రకటించటంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. అధికారులు కావాలని నంబర్ మార్చేసారంటూ మండిపడ్డాడు. అధికారులతో వాదనకు దిగాడు. తోటి దరఖాస్తుదారులు సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం షాపుల కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నామని పైగా ఇది ఆర్థిక సంబంధమైన విషయమని అలాంటప్పుడు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని బాధితుడితో పాటు గొంతు కలిపారు. దీంతో అధికారులకు, దరఖాస్తుదారులకు మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో కొన్ని సెకన్లు పాటు పవర్ కట్ అయ్యి హాల్ మొత్తం చీకట్లు అలుముకున్నాయి. దీంతో సందిట్లో సడేమియా అన్నట్లు అంబేద్కర్ ఆడిటోరియంలో మరింత గందరగోళం నెలకొంది. తిరిగి కొన్ని సెకండ్లలోనే కరెంటు రాగా అధికారులు ఆందోళనకారులను పిలిచి జరిగిన పొరపాటున వివరించి వాళ్లకి సర్ధి చెప్పారు. అధికారుల వివరణతో సంతృప్తి చెందిన ఆందోళనకారులు శాంతించారు. దీంతో తిరిగి లక్కీ డ్రా యదావిధిగా కొనసాగింది.

లక్కీ డ్రాలో వచ్చింది 6 కాదు 9వ నంబర్ అని ఎలా తేల్చారంటే…?

6వ నంబర్ 9వ నంబర్‌లను ఉల్టా చేసి చూస్తే ఆరు, తొమ్మిదవుతుంది.. తొమ్మిది ఆరవుతుంది. ఈ విషయంలోనే లక్కీ డ్రా తీసిన అధికారులు మొదట కన్‌ఫ్యూజ్ అయ్యారు. అయితే హౌసీ ఆటలో గాని, లక్కీ డ్రాలో గాని వినియోగించే సంఖ్యల పిక్కలపై 6 నెంబర్ గుర్తించేందుకు స్పష్టమైన ఇండికేటర్ ఉంటుంది. 6వ నెంబర్ పిక్కపై అంకె కింద అండర్ స్కోర్ ఉంటుంది. సో అండర్ స్కోర్ ఉంటే 6 నంబర్ అని, అండర్ స్కోర్ లేకపోతే 9వ నంబర్ అని గుర్తించాలి. ఇదే విషయాన్ని అధికారులు తేల్చి జరిగిన పొరపాటున ఆందోళనకారులకు వివరించడంతో వివాదం సుద్దమణిగింది.

మరిన్న ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..