తిరుమల లో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. తమిళుల పవిత్ర మాసం పెరటాసి కావడం, తెలుగు వారు పవిత్రంగా భావించే కార్తీక మాసం దగ్గర పడుతుండటంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతే కాకుండా సెప్టెంబర్ చివర్లో నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో పాల్గొనలేని భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఇప్పుడు తిరుమలకు వస్తున్నారు. దీంతో తిరుగిరులు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా అప్పుడప్పుడు ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది. ప్రస్తుతానికి కూడా తిరుపతికి రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 14, 15 తేదీల్లో సికింద్రాబాద్ – తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు వెల్లడించింది. శుక్రవారం సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరనున్న ప్రత్యేక రైలు 07485 నంబర్ గల రైలు.. మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు తిరుపతి చేరుకోనుంది.
శనివారం తిరుపతి నుంచి రాత్రి 7.50 గంటలకు బయల్దేరనున్న రైలు 07486 నంబర్ గల రైలు ఆదివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో CH.రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు.. రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రైల్వేలు.. ఆదాయంలోనూ దూసుకుపోతున్నాయి. నిత్యం లక్షల కొద్దీ ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చే భారతీయ రైల్వే ఆదాయ సముపార్జనలోనూ పురోగతి సాధిస్తోంది. గడిచిన ఆరు నెలల కాలంలో రూ.33 వేల కోట్లకు పైగా రైల్వేకు ఆదాయం పెరిగింది.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 8 వరకు రైల్వేలకు దాదాపు రూ.33,476 కోట్లు ఆదాయం సమకూరినట్టు భారతీయ రైల్వే వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో ప్యాసింజర్ రెవెన్యూ రూ.17,394 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది అది రెట్టింపుకు పెరగడం గమనార్హం.