ISRO PSLV C-62: నేడు ఇస్రో మరో కీలక ప్రయోగం.. దీని ఉపయోగం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ISRO PSLV C-62: ఇస్రో PSLV C-62 రాకెట్ ప్రయోగం శ్రీహరికోట నుంచి జరగనుంది. ఈ ఏడాది తొలి ప్రయోగమైన ఇది, 15 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్తుంది. వీటిలో EOS-N1 వాణిజ్య ఉపగ్రహం, 8 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. "అన్వేషణ" సిరీస్‌లో భాగంగా, ఇది వాతావరణ మార్పులు, విపత్తులు, సరిహద్దు భద్రత కోసం భూ పరిశీలన సేవలను అందిస్తుంది. దేశ రక్షణకు కీలకమైన ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆశిద్దాం..

ISRO PSLV C-62: నేడు ఇస్రో మరో కీలక ప్రయోగం.. దీని ఉపయోగం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Pslv C 62

Updated on: Jan 12, 2026 | 7:19 AM

ISRO PSLV C-62: వందో ప్రయోగం ద్వారా గ్రాండ్‌ సక్సెస్‌తో 2025కి గుడ్‌ బై చెప్పిన ఇస్రో.. 2026లో తొలి ప్రయోగంతో బోణీ కొట్టబోతోంది. ఇవాళ శ్రీహరికోట నుంచి మరో రాకెట్‌ ప్రయోగం జరగబోతోంది. కౌంట్‌ డౌన్‌ పూర్తి చేసుకుని.. సరిగ్గా ఉదయం 10 గంటల 17 నిమిషాలకు షార్ నుంచి PSLV C-62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లబోతోంది. ఇంతకీ.. ఈ శాటిలైట్‌ ప్రత్యేకతలేంటి?…

ఇస్రో చేపట్టే మరో కీలక ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది ఈ ఏడాది మొదట్లోనే తొలి ప్రయోగంతో చరిత్ర సృష్టించబోతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట వేదికగా PSLV C-62 రాకెట్‌ను మరికొన్ని గంటల్లో ప్రయోగించనుంది. ఉదయం 10గంటల 17నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనున్న ఈ రాకెట్.. 15 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. వీటిలో 8 విదేశీ ఉపగ్రహాలు, ఒక EOS-N1 ఉపగ్రహం ఉంది. ఇది న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ రూపొందించిన తొమ్మిదో పూర్తిస్థాయి వాణిజ్య ఉపగ్రహం.

ఇప్పటివరకు భారత రక్షణ వ్యవస్థకు మూడో నేత్రంలా పనిచేస్తున్న అనేక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఇస్రో.. ఇప్పుడు PSLV C-62 ద్వారా మరో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ సిరీస్‌ను నింగిలోకి పంపుతోంది. ఈ ప్రయోగానికి అన్వేషణ అని నామకరణం చేసింది. ఇక నుంచి భూ పరిశీలన.. సరిహద్దుల్లో దేశ భద్రత కోసం రక్షణ కవచంలా పనిచేసే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను అన్వేషణ సిరీస్‌లోనే ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది.

ఇక.. ఈ PSLV C-62 రాకెట్ ప్రయోగం ప్రత్యేకతలు ఏంటో చూద్దాం..

వాతావరణ మార్పులు, విపత్తులను ముందుగానే గుర్తిస్తుంది. EOS N1 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ శాటిలైట్ బరువు 1,485 కేజీలు కాగా..600 కిలోమీటర్ల దూరంలోని సింక్రనైజ్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశించనుంది. 200 కేజీల బరువున్న 15 ఉపగ్రహాలను ప్రయోగించబోతోంది. పొరుగు దేశాల కదలికలపై అంతరిక్షం నుంచి నిఘా పెట్టవచ్చు.

PSLV C-62 రాకెట్ ప్రయోగంలో భాగంగా.. ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాకెట్, ఉపగ్రహ నమూనాలను శ్రీవారి పాదాల దగ్గర ఉంచి పూజలు చేయించారు. శ్రీకాళహస్తిలోని ముక్కంటి, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయాల్లోనూ పూజలు చేశారు. దేశ రక్షణ రంగానికి ఇది అత్యంత కీలకం కాబోతుందన్నారు నారాయణన్‌. మొత్తంగా.. ఈ ఏడాది మొదట్లోనే కీలక ప్రయోగంతో ఇస్రో బోణీ కొట్టేందుకు సిద్ధమైంది. అన్వేషణ పేరుతో ఇస్రో చేపడుతోన్న అత్యంత కీలకమైన ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం విజయవంతం కావాలని దేశమంతా ఆకాంక్షిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి