East Godavari Crime News: రోజురోజుకి నేరాలు పెరిగిపోతున్నాయి. కొంతమంది క్షణికావేశంలో తొటివారిపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. ఏకంగా సొంతవారిపై కూడా విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా.. కోడి కూర (Chicken Curry) వండలేదని సొంత అన్న.. చెల్లిని చంపాడు. ఈ దారుణ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కన్నాపురంలో చోటుచేసుకుంది. కూనవరం సీఐ గజేంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోలోని కన్నాపురానికి చెందిన కొవ్వాసి నంద కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన్ను చూసేందుకు తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో నివసిస్తున్న చెల్లెలు సోమమ్మ (20) వారం కిందటే కన్నాపురం వచ్చింది. ఈ క్రమంలో రెండు రోజుల్లో వస్తానంటూ నంద భార్య పుట్టింటికి వెళ్లింది.
అయితే.. నంద గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఫుల్లుగా మద్యం తాగి కోడి మాంసం తీసుకోని ఇంటికి చేరుకున్నాడు. కోడి కూర చేయమంటూ సోమమ్మకు ఆర్డర్ వేశాడు. దీంతో నీరసంగా ఉందని సోమమ్మ చెప్పడంతో నంద గొడవకు దిగాడు. ఇంటికొచ్చేసరికి వండాలంటూ హెచ్చరించి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున వచ్చిన నంద.. కోడికూర వడ్డించాలని సోమమ్మను కోరాడు. ఆమె వండలేదని చెప్పడంతో దాడి చేశాడు. దీంతో ఆమె అరుస్తూ బయటకు పరిగెత్తింది. ఆమెను వెంబడించిన నంద.. వెంటాడి గొడ్డలితో నరికాడు.
ఆమె గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారంతా అక్కడికి చేరుకునే సరికి సోమమ్మ రక్తపుమడుగులో కొనఊపిరతో కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. దీంతో గ్రామస్థులు నిందితుడిని చెట్టుకు కట్టేసి ఉంచారు. సమాచారం మేరకు గ్రామానికి చేరుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: