పెద్దిరెడ్డికి ఫ్రీడమ్‌ దొరికింది, కానీ నోటికి తాళం పడింది. ఎస్ఈసీ ఆంక్షలపై మండిపడుతున్న వైసీపీ నేతలు

|

Feb 08, 2021 | 6:06 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షల నుంచి వైసీపీ నేత, మంత్రి పెద్దిరెడ్డికి ఫ్రీడమ్‌ దొరికింది. కానీ నోటికి తాళం పడింది. మంత్రిని ఇంటికే పరిమితం చేయాలన్న ఆర్డర్స్‌ని కొట్టేస్తూనే,  కండిషన్స్‌ అప్లై..

పెద్దిరెడ్డికి ఫ్రీడమ్‌ దొరికింది,  కానీ నోటికి తాళం పడింది.  ఎస్ఈసీ ఆంక్షలపై మండిపడుతున్న వైసీపీ నేతలు
The AP High Court
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షల నుంచి వైసీపీ నేత, మంత్రి పెద్దిరెడ్డికి ఫ్రీడమ్‌ దొరికింది. కానీ నోటికి తాళం పడింది. మంత్రిని ఇంటికే పరిమితం చేయాలన్న ఆర్డర్స్‌ని కొట్టేస్తూనే,  కండిషన్స్‌ అప్లై అంటూ మెలిక పెట్టింది హైకోర్టు. ఇల్లు దాటొచ్చు. కానీ ఎలాపడితే అలా మాట్లాడొద్దంటూ… మంత్రి పెద్దిరెడ్డికి ఊరటనిస్తూనే కండిషన్స్‌ పెట్టింది ఏపీ హైకోర్టు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మంత్రి పెద్దిరెడ్డిని గృహనిర్బంధంలో ఉంచాలన్న ఎస్‌ఈసీ ఆదేశాల్ని కొట్టేసింది కోర్టు. హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం…ఎస్‌ఈసీ ఆదేశాలు చెల్లవంటూ పెద్దిరెడ్డికి అనుకూలంగా తీర్పిచ్చింది. అయితే ఫ్రీగా తిరగొచ్చంటూనే, మీడియా ముందు నోరెత్తొద్దని ఆంక్షలు విధించింది ఏపీ హైకోర్టు. ఎలాంటి ప్రెస్‌మీట్‌లలోనూ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడకూడదంటూ ఆదేశించింది.

ఇలాఉండగా, అంతకుముందు ఇల్లు దాటడానికి వీల్లేదంటూ SEC ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు మంత్రి పెద్దిరెడ్డి. ముందస్తు నోటీసివ్వకుండా, వివరణ కూడా తీసుకోకుండా ఇంటికే పరిమితం చేయాలని ఉత్తర్వులివ్వడం రాజ్యాంగవిరుద్ధమన్నారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా మంత్రిని ఇంటికెలా పరిమితం చేస్తారని ప్రశ్నించారు పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది. మరోవైపు, మంత్రి పెద్దిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల క్లిప్పింగ్స్‌ని కోర్టుకు సమర్పించారు ఎన్నికల కమిషన్‌ న్యాయవాది. అధికారులను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామనడం, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడమేనని వాదించారు. నిబంధనల ప్రకారం పెద్దిరెడ్డి కదలికల్ని నియంత్రించే అధికారం ఎస్‌ఈసీకి ఉందని వాదించారు. అయితే ఆ వాదనతో ఏకీభవించని హైకోర్టు.. ఎస్‌ఈసీ ఆదేశాలు పాక్షికంగానే అమలవుతాయని స్పష్టంచేసింది.

హైకోర్టు తీర్పును అధికార పార్టీ నేతలు స్వాగతించారు. మంత్రి పెద్దిరెడ్డి విషయంలో ఎస్‌ఈసీ రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించినట్లు కోర్టు కూడా గుర్తించిందన్నారు. ఎన్నికల కమిషనర్ చంద్రబాబు ఏజెంట్‌గా వ్యవహరించారని ఆరోపించారు. ఒక మంత్రిని నిర్బంధించాలని ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేయడం ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నామన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.

కాగా, ఏకగ్రీవ పంచాయతీల్లో ఫలితాలను ఆపేయాలన్న SEC ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. మంత్రి వ్యాఖ్యలని సీరియస్‌గా తీసుకున్న ఎస్‌ఈసీ, ఈనెల 21వరకు మంత్రి పెద్దిరెడ్డి గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. అయితే, 24గంటల్లోనే పెద్దిరెడ్డికి అనుకూలంగా తీర్పొచ్చింది. కోర్టు తీర్పుతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలికేందుకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వెళ్లారు మంత్రి పెద్దిరెడ్డి. మరోవైపు, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఓటర్లకు వీడియో సందేశమిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటేసి ప్రజాస్వామ్య వ్యవస్థను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు.

ఫస్ట్ జర్నీ ఫ్యామిలీ కోసం అంకితం, అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ప్రయాణం ప్రపంచంలోనే ప్రత్యేకం