Heat Waves: ఇంట్లో నుంచి అవసరమైతేనే బయటకు రండి.. షాకింగ్ న్యూస్ చెప్పిన ఐఎండీ

ఇది షాకింగ్‌ న్యూస్‌. భానుడి భగ భగలతో మాడి పోతున్న జనానికి మరికొన్ని ఎక్కువ రోజులు మాడ పగలడం ఖాయం. ఎందుకంటే.. ఎప్పటిలా కాకుండా.. ఈ సారి మరో 4 రోజులు ఆలస్యంగానే నైరుతి రుతుపవనాలు వచ్చే ఛాన్స్‌ ఉందంటోంది వాతావరణ శాఖ. అంటే.. ఈ ఎండల వేడిని ఎంత లేదన్నా వారం రోజులు ఎక్కువగానే భరించక తప్పదంటున్నారు అధికారులు.

Heat Waves: ఇంట్లో నుంచి అవసరమైతేనే బయటకు రండి.. షాకింగ్ న్యూస్ చెప్పిన ఐఎండీ
Heat Wave

Updated on: May 17, 2023 | 8:19 AM

ఈసారి.. భారత్‌లోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం కాస్త ఆలస్యం కానుంది. జూన్‌ 4 నాటికి అవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికి కేరళలో ప్రవేశిస్తాయి. అయితే, ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా జూన్‌ 4న ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గతేడాది మే 29 నాటికే అవి కేరళ తీరానికి చేరుకున్నాయి. 2021లో జూన్‌ 3న, 2020లో జూన్‌ 1న ప్రవేశించాయి. ఎల్‌ నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ.. భారత్‌లో ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం గత నెలలో ప్రకటించింది. అయితే.. భారత్‌లో వర్షపాతం ప్రధానంగా రుతుపవనాల వల్లనే కురుస్తుంది. దేశ వ్యవసాయ రంగానికి ఇవి ప్రధాన ఆధారం. సాగు విస్తీర్ణంలో 52 శాతం రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇది దేశ మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం వాటా. తద్వారా దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వానికి కీలకమైన సహకారం లభిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. భానుడి సెగలకు జనం అల్లాడిపోతున్నారు. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుంటే.. మిగతా జిల్లాల్లో సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు హైదారాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. ఈనెల 19 నుంచి వేడి వాతావరణంతో పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించారు.

వాయువ్య భారత్‌ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ కూడా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి ప్రతాపానికి తోడు వడగాల్పులు రాష్ట్రంలోని ఉష్ణోగ్రతల తీవ్రతను గరిష్ఠానికి చేర్చాయి. కోస్తాంధ్ర, రాయలసీమల్లోని అన్ని ప్రాంతాల్లోనూ పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి. ప్రత్యేకించి కోస్తాంధ్రలోని ఉభయగోదావరి నుంచి నెల్లూరు వరకు ఉష్ణగాలుల ప్రభావం తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అత్యధికంగా రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతంలోని ధవళేశ్వరం వద్ద 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం