ఇంట్లో పెంపుడు కుక్కలు ఉన్నాయా..? జర భద్రం, దొంగలు మీ ఇంటినే టార్గెట్ చేయొచ్చు.. నయా ప్లాన్‌తో చోరీలు చేస్తున్న కేటుగాళ్లు..

| Edited By: శివలీల గోపి తుల్వా

Sep 04, 2023 | 1:29 PM

Vizianagaram: కుక్కలు ఉన్న ఇళ్లను రెక్కీ చేసి మరీ ఎంచుకుంటున్నారు. కుక్క ఇంట్లో ఉంటే దొంగలకు భయం ఉంటుందని, అలాగే ఎవరైనా కొత్తవారు కనిపిస్తే అరుస్తూ కుటుంబ సభ్యులను కూడా అప్రమత్తం చేస్తుందని పలువురు యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కుక్క ఉన్న ఇళ్ల యాజమానుల ధీమా, వారి నిర్లక్ష్యమే దొంగలకు అనువుగా మారుతుంది. ముఖ్య పట్టణాల్లో ఉన్న పెద్ద పెద్ద..

ఇంట్లో పెంపుడు కుక్కలు ఉన్నాయా..? జర భద్రం, దొంగలు మీ ఇంటినే టార్గెట్ చేయొచ్చు.. నయా ప్లాన్‌తో చోరీలు చేస్తున్న కేటుగాళ్లు..
Representative Image
Follow us on

విజయనగరం జిల్లా, సెప్టెంబర్ 4: విజయనగరం జిల్లాలో వరుస దొంగతనాలు జిల్లా వాసులను హడలెత్తిస్తున్నాయి. జిల్లాలో ఎక్కడో చోట నిత్యం దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రింబవళ్లు పోలీసులు గస్తీ కాస్తున్న దొంగలు ఏ మాత్రం తగ్గడం లేదు. చైన్ స్నాచర్స్ కూడా మరింతగా రెచ్చిపోతున్నారు. బైక్‌పై స్పీడ్‌గా వెళ్తూ మహిళల మెడల్లో అందినకాడికి లాక్కెళ్తున్నారు. బంగారం పోగొట్టుకోవడంతో పాటు బాధిత మహిళలు ప్రాణాపాయ స్థితిలో పడుతున్నారు. మరో వైపు బైక్ దొంగలు కూడా స్వైర విహారం చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట ద్వి చక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయి. చోరికి గురైన వాహనాల రికవరీ కూడా అంతంత మాత్రమే కావడంతో భాదితులు లబోదిబోమంటున్నారు. ఇక ఇళ్లలో జరుగుతున్న దొంగతనాలకు అయితే అంతూ పొంతూ లేదు. ఇళ్ళలో చొరబడి దొరికిన కాడికి దోచుకెళ్తున్నారు. ముఖ్యంగా నగరంలో ప్రముఖుల ఇళ్లే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడుతున్నారు ఘరానా దొంగలు.

అందులోనూ కుక్కలు ఉన్న ప్రముఖుల ఇళ్లను రెక్కీ చేసి మరీ ఎంచుకుంటున్నారు. కుక్క ఇంట్లో ఉంటే దొంగలకు భయం ఉంటుందని, అలాగే ఎవరైనా కొత్తవారు కనిపిస్తే అరుస్తూ కుటుంబ సభ్యులను కూడా అప్రమత్తం చేస్తుందని పలువురు యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కుక్క ఉన్న ఇళ్ల యాజమానుల ధీమా, వారి నిర్లక్ష్యమే దొంగలకు అనువుగా మారుతుంది. ముఖ్య పట్టణాల్లో ఉన్న పెద్ద పెద్ద భవనాలు, డ్యూప్లెక్స్ ఇళ్లు అలాగే ఆ ఇళ్లలో కుక్క ఉంటే చాలు దొంగలు టార్గెట్ చేస్తున్నారు. ఆ ఇళ్ల వద్ద రెక్కీ చేసి తమ ప్రతిభకు పదును పెడుతున్నారు. ఇంట్లో ఉన్న కుక్కని ఏదోలా ఏమార్చి ఇంట్లోకి చొరబడుతున్నారు. అలాంటి పలు కేసులు జిల్లాలో వెలుగులోకి రావడంతో కుక్కల యజమానులు ఖంగు తింటున్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మపురి వద్ద గల వసంత విహార్ డ్యూ ప్లెక్స్ హౌస్ లో ఓ ప్రముఖ వైద్యుడి నివాసం ఉంటున్నారు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఉదయం ఇంటిని బయటకు వెళ్లారు డాక్టర్ కుటుంబసభ్యులు. ఆ ఇంట్లో లేబర్ డాగ్ జాతి గల కుక్క కూడా ఇంటి ముందు కట్టేసి ఉంది.

ఇవి కూడా చదవండి

అయితే ఉదయం వెళ్లిన డాక్టర్ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చే సరికి ఇంట్లో దొంగతనం జరిగి ఉంది. ఇంట్లో ఉన్న పదమూడు తులాల బంగారం, డబ్బు కాజేశారు దుండగులు. తమ ఇంట్లో కుక్క ఉంది ఇబ్బంది లేదు అనే ఉద్దేశ్యంతోనే బంగారం, డబ్బు కూడా ఇంట్లో ఉంచారు. అలా కుక్క ఉందని నిర్లక్ష్యం గా ఉండటమే దొంగలకు కలిసొచ్చింది. ఇటీవల జరిగిన పలు దొంగతనాల్లో ఇలాంటి కేసులు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఘటనలతో పోలీసులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. కుక్కలు ఉన్నాయి, ఇబ్బంది లేదు, దొంగలు పడరు అని అనుకోవద్దు.. కుక్కలు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.