శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నూతన వధూవరుల నూరు వసంతాల జీవితాన్ని సర్వనాశనం చేసింది. వారు కన్నకలలను నిలువునా కుప్పకూల్చివేసింది. పచ్చని పారాణింకా ఆరలేదు. పెళ్ళి భజంత్రీలు చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. కలకాలం కలసి కాపురం చేయాలనుకున్న జంట పెళ్ళి అయిన మూడో రోజే మృత్యువాతపడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇచ్ఛాపురంకి చెందిన వేణు, ఒడిశాకు చెందిన ప్రవల్లికలకు నాలుగు రోజుల క్రితం ఈనెల 10 వతేదీన సింహాచలంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. 12వ తేదీన ఇచ్ఛాపురంలో విందు ఏర్పాటు చేశారు.
భాజా భజంత్రీల మధ్య, బంధుమిత్రుల ఆశీర్వాదాల మధ్య మూటగట్టుకున్న ఆనందాన్ని మోసుకుంటూ ఇచ్ఛాపురం నుంచి ఒడిశాలోని అత్తగారింటికి బయలుదేరిన ఈ నవ జంట స్వప్నాలను చిదిమేసింది ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యుశకటం.
నవ వధూవరులు ప్రయాణిస్తోన్న బైక్‌ని వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రవల్లిక మృత్యువాత పడ్డారు. ఆసుపత్రికి చేర్చేలోపు వరుడు వేణు కూడా తుది శ్వాస విడిచారు. ఈ విషాద ఘటన ఆ రెండు కుటుంబాలను దుఃఖసాగరంలో ముంచేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం