Andhra Pradesh: మోసం చేయడానికి వాళ్లే కావాలి.. సైబర్ క్రిమినల్స్ ఇలా గురి పెట్టారేంటి..?

డిజిటల్ కీటుగాళ్లు కడప జిల్లా పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వారి వద్ద నుంచి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇప్పటికే కడప జిల్లాలో గతంలో ఒక డిజిటల్ కేసు నమోదు కాగా, ఇప్పుడు మరో కేసు వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ ఫోన్ కాల్స్ చేయడం, సిబిఐ అధికారులం అంటూ వారిని బెదిరించడం, వారి వద్ద నుంచి లక్షలకు లక్షల రూపాయలు దండుకుంటున్నారు.

Andhra Pradesh: మోసం చేయడానికి వాళ్లే కావాలి.. సైబర్ క్రిమినల్స్ ఇలా గురి పెట్టారేంటి..?
Digital Arrest

Edited By: Balaraju Goud

Updated on: Nov 29, 2025 | 5:20 PM

డిజిటల్ కీటుగాళ్లు కడప జిల్లా పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వారి వద్ద నుంచి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇప్పటికే కడప జిల్లాలో గతంలో ఒక డిజిటల్ కేసు నమోదు కాగా, ఇప్పుడు మరో కేసు వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ ఫోన్ కాల్స్ చేయడం, సిబిఐ అధికారులం అంటూ వారిని బెదిరించడం, వారి వద్ద నుంచి లక్షలకు లక్షల రూపాయలు దండుకుంటున్నారు. అంతేకాదు మానసికంగా హింసించడంతో తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

కడప జిల్లా పులివెందుల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మరో ఉపాధ్యాయుడు డిజిటల్ వేధింపులు తాళలేక మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే కడప జిల్లాలో రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ సిబిఐ అధికారుల పేరుతో కొందరు కేటుగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ కేసులకు సంబంధించి కడప జిల్లాలో ఇప్పటివరకు రెండు కేసులు నమోదు కాగా, ఇందుకు సంబంధించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా మరో విషాదకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కోటిన్నర రూపాయలను డబ్బులను కేటుగాళ్లకు సమర్పించుకుని మృత్యువాత పడ్డాడు ఓ రిటైర్డ్ ఉద్యోగి. మృతి చెందిన టీచర్ కుమారుడి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. గతంలో వేంపల్లికి చెందిన రిటైర్డ్ ఎమ్మార్వో వీరారెడ్డిని దాదాపు 7 నెలలు వేధించి లక్షలాది రూపాయలు దోచుకున్నారు. పక్కా ఫ్లాన్‌తో డిజిటల్ కేటుగాళ్లను పట్టుకున్న పోలీసులు.. ఈ సంఘటన మరువక ముందే పులివెందల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసును కూడా ఛేదించారు.

సిబిఐ అధికారులమంటూ రిటైర్డ్ ఉపాధ్యాయుడిని బెదిరించి దాదాపు కోటి 60 లక్షల రూపాయలను డిజిటల్ కేటుగాళ్లు దోచుకున్నారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ చెప్పిన వివరాల మేరకు ఢిల్లీలో ఒక సామాన్య వ్యక్తితో కార్పొరేట్ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయించి డిజిటల్ మోసానికి పాల్పడినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సిబిఐ అధికారులమంటూ బెదిరించిన కేసులు 22 నమోదు అయ్యాయి. అందులో భాగంగా రెండు కడప జిల్లాలో నమోదయ్యాయని వాటిని ఛేదించామని జిల్లా ఎస్పీ తెలిపారు.

ప్రస్తుతం అరెస్ట్ అయిన డిజిటల్ కేటుగాళ్లలో మధు అనే నిందితుడిపై హైదరాబాద్‌లో కూడా డిజిటల్ అరెస్ట్ కేసు ఉంది. ప్రస్తుతం అరెస్ట్ అయిన ఆరుగురు వద్ద నుంచి 1,50,000 రూపాయల నగదును, నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఏది ఏమైనా వాట్స్అప్ కాల్ ద్వారా వచ్చే ఎటువంటి డిజిటల్ మోసాలకు ప్రజలు మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సిబిఐ అధికారులం అంటూ, పోలీస్ అధికారులం అంటూ.. కానీ ఎవరైనా కాల్ చేస్తే సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లకు వెళ్లి వివరణ కోరి ఆ తరువాత వాటిపై స్పందించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..