Pregnant woman with dolly: అంతరిక్షం దాటి టెక్నాలజీ పరుగులు పెడుతోంది. ఇతర గ్రహాల్లో గూడు కట్టుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. మానవాళి మనుగడకు అనుకూలమో కాదో చూసేందుకు రాకెట్ల మీద రాకెట్లు పంపిస్తున్నాం. కానీ మన కళ్లముందే కరిగిపోతున్న గిరిజనుల కోసం రోడ్లు వేయలేకపోతున్నాం. రవాణా సౌకర్యం కల్పించలేకపోతున్నాం. ఏళ్లు గడుస్తున్నా డోలీ కష్టాలు మాత్రం తొలగిపోలేదు. పాలకులు మారుతున్నారు… పథకాలు మారుతున్నాయి… వారి తలరాత మాత్రం మారడం లేదు.
నిండు గర్భిణిని డోలిపై మోసుకెళ్తున్న మరో సంఘటన విశాఖ జిల్లా పాడేరు మండలంలో కనిపించింది. గాలిపాడు గ్రామానికి చెందిన సిదరి రాస్మో పురిటి నొప్పులతో బాధపడుతుంటే డెలివరీ ఇలా డోలీపై మోసుకెళ్లారు. తరాలుగా రహదారి సౌకర్యానికి నోచుకోలేదు ఈ గ్రామం. డోలీ యాతనలు తప్పడం లేదు. అంబులెన్స్ వచ్చే ఛాన్స్ లేక వీళ్లకు ఈ దుస్థితి. గాలిపాడు నుంచి బోరగొంది గ్రామం వరకు సుమారు 3 కిలోమీటర్లు ఇలా డోలిపైనే గర్భిణినీ మోసుకెళ్లారు. బోరుగొంది గ్రామం చేరాక అక్కడ నుంచి ఆంబులెన్స్‌లో పాడేరు జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
విశాఖ ఏజెన్సీలో రెండు రోజుల క్రితం ఇలాంటి సంఘటనే జరిగింది. ఇది మరింత హృదయవిదారక సంఘటన. అరకువేలి మండలం గోందని గ్రామానికి చెందిన గర్భిణిని రెండు కిలోమీటర్లు నడిపించాల్సి వచ్చింది. గ్రామంలోకి ఆంబులెన్స్ రాదని చెప్పడంతో ఆమెకు దుస్థితి. బస్కి మెయిన్ రోడ్ వరకు నడుచుకుంటూ వెళ్లగా అక్కడి నుంచి ఆంబులెన్స్‌లో హాస్పిటల్‌కి తరలించారు. అయితే, మార్గమధ్యంలోనే ఆమెకు డెలివరీ అయింది.
ఇటువంటి ఘటనలు విశాఖ ఏజెన్సీలో సర్వసాధారణంగా మారిపోతున్నాయి. సకాలంలో ఆస్పత్రికి చేరి చికిత్స అందిసతే సరే… లేదంటే స్వగ్రామం నుంచి డోలీపై వెళ్లి తిరిగి పాడిపై వస్తున్నవారెందరో. అధికార యంత్రాంగం చెబుతోన్న గిరిజన సంక్షేమం, అభివృద్ధి కేవలం మాటలకే పరిమితమవుతోంది. లెక్కలు కాగితాలపై రాతలుగాను, నేతల మాటలు నీటి మూటలుగాను మిగిలిపోతున్నాయి.
Read Also… 400 మంది ప్రాణాలను కాపాడిన ఆంధ్ర పోలీసులు..! సకాలంలో స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం..