Red Sandalwood: శేషాచలం అడవుల్లో ఏం జరుగుతోంది? గుట్టుచప్పుడు కాకుండా ఎర్ర చందనం స్మగ్లింగ్ జరిగిపోతోందా? కర్నూలు జిల్లాలో పట్టుబడిన సూపర్ ఫైన్ క్వాలిటీ ఎర్ర చందనం ఎక్కడిది? ఏడు టన్నులకే ఏడు కోట్లయితే… ఇప్పటివరకు తరలిపోయిన శాండిల్ ఎంత? కర్నూలు జిల్లాలో పెద్దఎత్తున ఎర్ర చందనం పట్టుబడిన తర్వాత ఇవే అనుమానాలు అందరిలోనూ రేకెత్తుతున్నాయి. ఓర్వకల్ మండలం నన్నూరులో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు… ఏడు టన్నుల ఎర్ర చందనం దుంగలను పట్టుకున్న సంగతి తెలిసిందే. సూపర్ క్వాలిటీ రెడ్ శాండిల్ గా దీన్ని గుర్తించారు. ఈ ఎర్ర చందనం విలువ ఏడు కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తుండగా దీన్ని పట్టుకున్నారు.
ఎర్రచందనం పేరు వింటేనే చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు గుర్తుకొస్తాయ్. ఎందుకంటే, ఇక్కడే ప్రపంచంలోనే అత్యంత నాణమైన రెడ్ శాండిల్ లభిస్తుంది. అందుకే, ఇక్కడి ఎర్ర చందానికి వరల్డ్ వైడ్ గా డిమాండ్. అయితే, ఏపీలో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతున్న తీరు చూస్తే మతిపోతుంది. ఏపీ నుంచి అధికారికంగా ఎగుమతి అయ్యేది రవ్వంతయితే… స్మగ్లర్లు కొట్టేసేది కొండంత. ఏటా వందలు వేల కోట్ల విలువైన ఎర్ర చందనం అక్రమంగా రాష్ట్రం, దేశం దాటిపోతోంది.
ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎర్ర చందనం మాత్రం యధేచ్చగా తరలిపోతూనే ఉంది. విచ్చలవిడిగా ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్న కేటుగాళ్లు కోట్లు కుమ్మేస్తున్నారు. ఇక, తెర ముందు కనిపించేది కూలీలైతే… తెర వెనుక ఉండేది మాత్రం పేరు మోసిన క్రిమినల్స్, రౌడీ షీటర్స్, చోటామోటా పొలిటికల్ లీడర్స్. అందుకే, ఎర్ర చందనం స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేయడం పోలీసులకు కష్టతరంగా మారిందనే మాట వినిపిస్తోంది.