Andhra: దుర్గమ్మ ఆలయంలో అద్భుతం.. ఈ దృశ్యాలను అరుదుగా మాత్రమే చూడగలం..

ఉత్తరాంధ్ర కల్పవల్లి అని ప్రసిద్ధి చెందిన పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కార్తీక మాస ద్వాదశి పర్వదినం, ఆదివారం ఉదయం.. సూర్యుని తొలి లేలేత కిరణాలు ఆలయం ముఖద్వారం, మండపాలు దాటి నేరుగా గర్భగుడిలోని అమ్మవారి మూలవిరాట్‌ను తాకాయి.

Andhra: దుర్గమ్మ ఆలయంలో అద్భుతం.. ఈ దృశ్యాలను అరుదుగా మాత్రమే చూడగలం..
Divine Event

Edited By: Ram Naramaneni

Updated on: Nov 16, 2025 | 5:20 PM

ఉత్తరాంధ్ర కల్పవల్లి, భక్తుల కొంగు బంగారంగా కొలిచే పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండలో వేంచేసి ఉన్న శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతం అయింది. గర్భగుడిలోని మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. కార్తీక మాసం, ద్వాదశి పర్వదినాన.. అమ్మవారికి, సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన ఆదివారం రోజున ఆలయ గర్భగుడిలోని అమ్మవారి మూల విరాట్‌ను సూర్యుని లేలేత కిరణాలు తాకాయి. ఉదయం 6:20 గంటల సమయంలో అమ్మవారి విగ్రహాన్ని తాకిన కిరణాలు సుమారు 9 నిమిషాలు పాటు విగ్రహంపై ప్రసరించాయి.

నిత్యం పసుపు వర్ణ ముఖ ఛాయతో దర్శనం ఇచ్చే దుర్గా అమ్మవారు సూర్యుని లేలేత కిరణాలు తాకటంతో దుర్గమ్మ మోము బంగారు వర్ణంలో దేదీప్యమానంగా వెలుగొందింది. ఈ అపురూపమైన ఘట్టాన్ని కనులారా వీక్షించిన అమ్మవారి భక్తులు భక్తి పారవశ్యంతో పరవశించిపోయారు. బయట ఉండే క్యూ లైన్ కాంప్లెక్స్, ముఖద్వారం, ధ్వజస్థంభం, ముఖ మండపం, అంతరాలయం దాటి గర్భగుడిలోని అమ్మవారిని కిరణాలు తాకటం మహిమగానే భావిస్తున్నారు. ఆలయ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా సూర్యుని కిరణాలు అమ్మవారిని తాకటం శుభపరిణామం అంటున్నారు ఆలయ అర్చకులు.