AP News: నల్ల బెల్లం, ఇదిప్పుడు ఏపీలో కలకలం రేపుతోంది. నాటు సారా తయారీదారులకు ఆయుధంగా మారుతోందీ బెల్లం. నల్ల బెల్లం కారణంగా అతిపెద్దదైన అనకాపల్లి(anakapalle) బెల్లం మార్కెట్ కొన్నిరోజులు క్లోజైందంటే దీని ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు. ఉత్తరాంధ్రలో అయితే నల్ల బెల్లం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. అయితే, ఇప్పుడీ నల్ల బెల్లం ఏపీ అంతటా అక్రమ రవాణా జరుగుతోంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం(vetapalem mandal) రామన్నపేటలో పెద్దఎత్తున నల్ల బెల్లం పట్టుకున్నారు పోలీసులు. లారీలో అక్రమంగా తరలిస్తోన్న 200 బుట్టల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఈ నల్ల బెల్లం పట్టుబడింది. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బెల్లాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు చీరాల DSP శ్రీకాంత్. నాటు సారా తయారీ కోసమే నల్ల బెల్లాన్ని తరలిస్తున్నారని ఆయన చెప్పారు. చిత్తూరు నుంచి తెనాలికి ఇది సరఫరా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. నల్ల బెల్లం అక్రమంగా రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతోనే దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. నల్ల బెల్లం తెప్పించుకున్న షాపు యజమానితోపాటు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నల్ల బెల్లం అక్రమ రవాణా, అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చీరాల DSP శ్రీకాంత్.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..