శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి(Puttaparthi) మున్సిపల్ కమిషనర్ ఆత్మహత్య చేసుకున్నారు. కడప నగరపాలక కార్యాలయంలో సూపరిండెంట్ గా పని చేస్తున్న ముని కుమార్ మూడు నెలలే క్రితమే డిప్యూటేషన్ పై పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో మునికుమార్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. కడప రైల్వే గేటు వద్ద ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత పనుల నిమిత్తం రెండు రోజుల కిందట మునికుమార్ పుట్టపర్తి నుంచి కడపకు(Kadapa) వెళ్లాడు. కడప శివారులోని రాయచోటి రైల్వేగేటు వద్ద రైలు కింద పడి మునికుమార్ మృతి చెందారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గతంలోనూ పుట్టపర్తి మున్సిపల్ వైఎస్సార్సీపీ కోఆప్షన్ మెంబర్ ఆదం అహ్మద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాను చనిపోతున్నానని చివరిసారిగా ఓ వీడియో తీసి సామాజిక మాధ్యమాల ద్వారా పంపించారు. వీడియో పంపించిన కొద్దిసేపటికి ఆయన పుట్టపర్తి ప్రశాంతి రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు ఎవరిపై చర్యలు తీసుకోవద్దని, ఎవరినీ బాధపెట్టవద్దని కోరారు. తాను చనిపోయాక తన అవయావాలను హాస్పిటల్‌కు దానం చేయాలని కోరారు. అయితే ఆయన ఎన్నికైన మూడు నెలలకే ఆత్మహత్యకు పాల్పడడం విషాదంగా మారింది. కాగా.. ఈ ఘటనను మరవకముందే పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ మునికుమార్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.