Andhra: కరువు నేలలో ‘కాస్ట్లీ’ పంట.. రైతు సక్సెస్‌ఫుల్ ప్రయోగం!

కరువు ప్రాంతంగా పేరున్న పులివెందులలో ఓ రైతు వినూత్న ప్రయోగంతో సత్తా చాటారు. 39 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య డ్రిప్ ఇరిగేషన్‌తో అవకాడో పంటను సాగు చేసి తొలి దిగుబడిలోనే నాలుగు టన్నుల పంటను పండించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ రైతు ప్రయోగాన్ని ప్రశంసించడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.

Andhra: కరువు నేలలో కాస్ట్లీ పంట.. రైతు సక్సెస్‌ఫుల్ ప్రయోగం!
Varadar Reddy, Avocado Farming

Edited By:

Updated on: Sep 01, 2026 | 3:39 PM

 

ఈ ప్రాంతంలో పంటలు పండాలంటే వర్షాలు కురవాలి.. లేదంటే నీటి కుంటలు నిండాలి. కానీ రెండూ సరిగా ఉండవు. మండుటెండలు, నీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడే ప్రాంతమిది. అలాంటి కరువు నేలలో ఓ రైతు మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. సాధారణంగా సాగు చేసే పంటలకు భిన్నంగా.. ఖరీదైన అవకాడో పంటను సాగు చేసి సక్సెస్ అయ్యాడు. అంతేకాదు.. ఆయన ప్రయోగాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసించారు.

39 నుంచి 46 డిగ్రీల వేడిలో అవకాడో సాగు

కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో వ్యవసాయం చేయడం అంత సులభం కాదు. చిత్రావతి డ్యాంలో నీరు ఉంటేనే కొంత మేర సాగుకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. లేదంటే సకాలంలో వర్షాలు కురవాలి. ఈ రెండూ అనుకూలించకపోవడంతో ఈ ప్రాంత రైతులు సాధారణంగా అరటి, చీని వంటి పంటలపైనే ఆధారపడుతుంటారు. అలాంటి ప్రాంతంలో.. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం వెలుదుండ్ల గ్రామానికి చెందిన రైతు వరదారెడ్డి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా చల్లటి వాతావరణంలో సాగయ్యే అవకాడోను.. ఏకంగా 39 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే పులివెందుల ప్రాంతంలో సాగు చేశారు.

రైతుల హేళన.. అయినా వెనక్కి తగ్గలేదు

అవకాడో సాగు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు తోటి రైతులు తనను హేళన చేశారని వరదారెడ్డి తెలిపారు. గతంలో అరటి, చీని పంటల సాగులో నష్టాలను చవిచూశానని.. అందుకే కొత్త పంటపై ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అవకాడో సాగుపై యూట్యూబ్ ద్వారా సమాచారం సేకరించడంతో పాటు.. ఉద్యానవన శాఖ అధికారులను కలిసి వారి సలహాలు తీసుకున్నారు. స్థానిక వాతావరణానికి అనుకూలంగా ఉండే అవకాడో రకాలను ఎంపిక చేసుకుని.. రెండెకరాల పొలంలో 300 మొక్కలను నాటారు.

మూడున్నరేళ్ల తర్వాత తొలి దిగుబడి

అవకాడో మొక్కలు ఎదిగి దిగుబడికి రావడానికి సుమారు మూడున్నరేళ్లు పట్టింది. ఈ కాలంలో మొక్కల పెంపకానికి సుమారు రూ.3.5 లక్షల వరకు ఖర్చు చేసినట్లు వరదారెడ్డి తెలిపారు. తొలి దిగుబడిలోనే ఏకంగా నాలుగు టన్నుల అవకాడోలను పండించారు. వాటి ద్వారా సుమారు రూ.4 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్‌ విధానాన్ని ఉపయోగించి.. తీవ్ర ఉష్ణోగ్రతల మధ్య కూడా పంటను విజయవంతంగా సాగు చేసినట్లు చెప్పారు.

అంతర్‌పంటలతో అదనపు ఆదాయం

అవకాడో తోటలో ఖాళీగా ఉన్న స్థలాన్ని కూడా రైతు వరదారెడ్డి సమర్థంగా వినియోగించారు. అవకాడోకు అంతర్‌పంటగా టమాటా, వంకాయ సాగు చేశారు. వాటి ద్వారా కూడా అదనపు ఆదాయం పొందినట్లు తెలిపారు. భవిష్యత్తులో అవకాడో మొక్కలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. సొంతంగా అవకాడో నర్సరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వరదారెడ్డి తెలిపారు.

ప్రధాని మోదీ ప్రశంసలతో గర్వంగా ఉంది

తన ప్రయోగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించి అభినందించడం పట్ల రైతు వరదారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ‘నేను ఒక సామాన్య రైతును. కానీ ప్రధాని నా పేరును ప్రస్తావించి అభినందించడం చాలా గర్వంగా ఉంది. నా గురించి దేశానికి తెలిసేలా చేశారు’ అని వరదారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కరువు, నీటి కొరత, అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయని సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా.. కొత్త పంటలు, ఆధునిక సాగు పద్ధతులపై దృష్టి పెడితే రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చని వరదారెడ్డి నిరూపించారు. కరువు నేలలో కాస్ట్లీ పంటను పండించి.. ఎందరో రైతులకు ఆదర్శంగా నిలిచారు.

Loading...
Unable to load recommendations.
Follow Us