
సంక్రాంతి పండుగ వేళ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు షాక్ తగిలింది. పండుగ సందర్భంగా ప్రతీఒక్కరూ తమ ఇంట్లో చికెన్, మటన్ వండుకుంటూ ఉంటారు. ఇక అతిధులకు కూడా రకరకరాల నాన్ వెజ్ వంటకాలు వడ్డిస్తారు. సంక్రాంతి పండుగ సమయాల్లో బాయిలర్ చికెన్ కంటే మటన్, నాటుకోడి చికెన్ ఎక్కువగా తింటారు. అంతేకాకుండా సంక్రాంతికి నాటుకోడి వండుకోవడం, గ్రామ దేవతలకు నాటుకోడితో మెక్కులు చెల్లించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. దీంతో పండగ వేళ డిమాండ్ పెరగడంతో నాటుకోళ్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నాటుకోళ్ల ఉత్పత్తి పెరిగిపోవడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీటి ధరలు భారీగా పెరిగాయి. దీంతో పండక్కి నాటుకోడి మాంసం వండుకోవాలంటే భయపడే పరిస్థితికి సామాన్యులు వచ్చేశారు.
కేజీ నాటుకోడి దాదాపు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. సాధారణ రోజుల్లో రూ.800గా వీటి ధర ఉండేది. ఇప్పుడు పండుగ సీజన్ కావడంతో రూ.2 వేలకు చేరుకుంది. అంత ధర పెట్టి సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. గోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో నాటుకోళ్లకు ఫుల్ డిమాండ్ పెరగడంతో ధరలు ఆమాంతం పెరిగాయి. ఇక పందెం కోళ్ల ధరలు అయితే రూ.లక్షల్లోనే ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో కేజీ నాటుకోడి రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు ఉంది. అటు నాటుకోడి ధర ఇలా ఉండగా.. బాయిలర్ చికెన్ ధరలు కూడా పెరుగుతున్నాయి. కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.340కి చేరుకుంది. గత నెలలో రూ.230గా ఉన్న ధరలు ఇప్పుడు రూ.100 మేర పెరిగాయి. పండక్కి వివిధ ప్రాంతాలకు సరఫరా పెరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
హైదరాబాద్, విజయవాడతో పాటు వరంగల్‌లో కేజీ చికెన్ రూ.340 మధ్య పలుకుతోంది. ఇక ఏపీలో కొన్ని జిల్లాల్లో రూ.300 వరకు ఉంటుంది. రానున్న వారంలో పండుగ ఉండటంతో ధరలు మరింతగా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. మరో నెల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని పాల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ఆ తర్వాత దిగొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. దాణా ఖర్చులు పెరగడం, ఫామ్స్ నిర్వహణ ఖర్చులు పెరగడంతో ధరలను పెంచాల్సి వస్తుందని చెబుతున్నారు. అటు కేజీ మటన్ రూ.800 నుంచి రూ.900 వరకు పలుకుతోంది. మటన్‌ను దాటి నాటుకోడి మాంసం ధరలు పెరిగాయి.