Pregnant Woman: నెలలు నిండిన గర్భిణికి.. ఉమ్మనీరు పోవడంతో ప్రసవం ప్రమాదంగా మారింది. దీంతో కాకినాడ జనరల్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలని సీహెసీ వైద్యులు సూచించారు. అంబులెన్స్ లో గర్భీణీని తరలిస్తున్న సమయంలో సిబ్బంది సమయస్ఫూర్తిగా స్పందించి తల్లీబిడ్డా క్షేమంగా ఉండేలా చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని రౌతులపూడి మండలం గుమ్మరేగులకు చెందిన గంటిమళ్ల గంగాలక్ష్మి(24) నెలలు నిండటంతో రౌతులపూడి సీహెచ్ సీలో చేరింది. ప్రసవం కష్టం అనిగుర్తించిన వైద్యులు ఆమెను శుక్రవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు. పిఠాపురం 108కి కాల్ రావడంతో గంగాలక్ష్మిని అంబులెన్స్ లో కాకినాడ తరలించారు. వాహనం అచ్చింపేట దాటే సరికి నొప్పులు ఎక్కువయ్యాయి. మరోవైపు ఉమ్మనీరు సైతం పోవడంతో గర్భిణీ పరిస్థితి విషమంగా మారింది. దీంతో అంబులెన్స్ ఈఎంటీ పబ్బినీడి ప్రసాద్, పైలెట్ సగరం నాగేశ్వరరావులు వాహనం
రోడ్డు పక్కన నిలిపి అత్యవసరంగా ప్రసవం చేశారు. పుట్టిన వెంటనే పాప ఏడకపోవడంతో అంతా కంగారు పడ్డారు. అయితే 108లోని వైద్య సదుపాయాలు ఉపయోగించడంతో పాటూ ఆక్సిజన్ అందించారు. దీంతో పాప ఏడ్చిందని ఈఎంటీ వర ప్రసాద్ తెలిపారు. వెంటనే తల్లీ బిడ్డను అదే అంబులెన్స్ లో కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన
వైద్యం అందడంతో తల్లీ బిడ్డా క్షేమంగా వున్నారని ప్రసాద్ వివరించారు. అవసరమైన సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి తల్లీ బిడ్డను రక్షించిన 108 సిబ్బందిని పలువురు అభినందించారు. అయితే గంగాలక్ష్మికి ఇది నాల్గవ ప్రసవం.