Andhra Pradesh: పవర్ లూమ్ కార్మికుల ధర్నాతో దద్దరిల్లిపోయింది నగరి టౌన్. వేలాది మంది రోడ్డెక్కడంతో చెన్నై-తిరుపతి హైవేపై రాకపోకలు స్తంభించిపోయాయ్. మంత్రి ఆర్కే రోజా సొంత నియోజకవర్గం నగిరిలో పవర్ లూమ్ కార్మికులు రోడ్డెక్కారు. కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ నగరి హైవేను ముట్టడించారు. వేలాది మంది కార్మికులు రోడ్డుపైకి రావడంతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. చెన్నై-తిరుపతి జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
పవర్ లూమ్స్ కార్మికుల ధర్నాతో దద్దరిల్లిపోయింది నగిరి పట్టణం. ఒకవైపు హైవేను, మరోవైపు ఎమ్మార్వో ఆఫీస్‌ను ముట్టడించి నిరసన తెలిపారు కార్మికులు. తాము ఒక మెట్టు దిగినా, యాజమాన్యం మాత్రం తమ డిమాండ్‌ను పట్టించుకోడం లేదంటున్నారు కార్మిక నేతలు. పదేళ్లుగా కూలీ రేట్లు పెంచలేదని, తామెలా బతకాలని వాపోతున్నారు కార్మికులు. నిత్యవసర వస్తువుల ధరలన్నీ పెరిగినా, తమకు మాత్రం పదేళ్లనాటి రేట్లే ఇస్తే తమ పిల్లల్ని ఎలా తిండిపెట్టగలమని ప్రశ్నిస్తున్నారు. కాగా, పవర్ లూమ్ కార్మికుల ఆందోళనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో మాస్టర్ వీవర్స్, కార్మికులతో చర్చలు జరిపారు ఆర్డీవో అండ్ లేబర్ కమిషనర్. ఇరువర్గాలు ఒక నిర్ణయానికి రావడంతో ఆందోళన విరమించారు పవర్ లూమ్ కార్మికులు.